నీలగిరి, ఏప్రిల్ 19 : నల్లగొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణారావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. చర్లపల్లిలో అర్బన్ పార్క్, మర్రిగూడ జంక్షన్లో అభివృద్ధి, రోడ్లు డివైడర్ పనులను పరిశీలించారు. పట్టణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు, ఏజెన్సీలు, ఇంజినీర్లను ఆడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పనుల వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతున్నందున డే అండ్ నైట్ షిప్టు ప్రకారం ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో పనులకు చెట్లు అడ్డుగా వస్తున్నందున సర్వే చేసి తొలగించాల్సిన చెట్లు, షిఫ్ట్ చేయాల్సిన చెట్లు రెండు వేర్వేరుగా మార్కింగ్ చేయాలని షిప్టింగ్ బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పనులన్నింటిని పూర్తి చేయాలని, పది రోజుల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాల కెనాల్ బ్రిడ్జి, వీటి కాలనీ, ఎల్వీ కుమార్ పెట్రోల్ బంకు, ఉడిపి హోటల్ ప్రాం తాల్లో రోడ్ల పనుల్లో నాణ్యతను పరిశీలించారు. ఏజెన్సీలు ప్రమాణాలు పాటించాలని కోరారు. ఆయన వెంట ఈఈ శ్రీనివాస్, డీఈ వెంకన్న, ఏసీపీ నాగిరెడ్డి ఇంజినీర్లు ఉన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శన
నార్కట్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణ వెల్లెంలలో బృహత్ పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. వనంలో బోర్ వేసినప్పటికీ మోటారు కనెక్షన్ లేకపోవడం గమనించిన వెంటనే కనెక్షన్ ఏర్పాటు చేయాలని అదేశించారు. మొక్కల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. చౌడంపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేశారు. మొక్కలకు సంరక్షణ, వాటరింగ్ సక్రమంగా చేయకపోవడం వల్ల మొక్కలు ఎండిపోవడం గమనించి కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీపీఓను ఆదేశించారు.