మిర్యాలగూడ, ఏప్రిల్ 19 : ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎస్వీ గార్డెన్ ఫంక్షన్హాల్లో నిరుద్యోగ యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖల్లో ఖాళీల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అండగా నిలువాలనే ఉద్దేశంతో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ నిష్ణాతులైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాల సాధనకు యువత కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ యువతీ యువకులు కష్టపడి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. శిక్షణ పొందుతున్న వారందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆర్డీఓ రోహిత్‌సింగ్, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, కోటేశ్వర్రావు పాల్గొన్నారు.