నల్లగొండ, ఏప్రిల్ 19 : ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రభావంతో ఉదయం 9గంటలకే వాతావరణం వేడెక్కుతున్నది. దాంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్న పరిస్థితి. గత వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 38 నుంచి 39 డిగ్రీల మధ్యలో నమోదవుతుండగా సోమవారం 40, మంగళవారం 41డిగ్రీలు నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుండడంతో ఎండ ప్రభావం అధికంగా ఉంటున్నది. కరెంట్ కోతలు లేకపోవడంతో జనం ఇండ్లల్లోనే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద ఉపశమనం పొందుతున్నారు.
సూర్యాపేట,యాదాద్రిలో 42డిగ్రీలు…
మంగళవారం నల్లగొండ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదు కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 42 , సూర్యాపేట జిల్లాలో 42 డిగ్రీలు రికార్డయ్యింది. కనిష్ఠ ఉష్ణోగ్రత నల్లగొండలో 24.4, సూర్యాపేటలో 25, యాదాద్రి భువనగిరిలో 25డిగ్రీలు నమోదైంది. విద్యాసంస్థలు ప్రస్తుతం ఒంటిపూట మాత్రమే నడిపిస్తుండడంతో విద్యార్థులు మధ్యాహ్నానికే ఇండ్లకు చేరుకుంటున్నారు. దాంతో ఎండ ప్రభావం వారిపై తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతుండగా ఈ నెల 24నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు.