తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్న మొదటి వ్యక్తి రాజశేఖర్‌రెడ్డి
వైఎస్ షర్మిలపై జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ధ్వజం
నల్లగొండ, మార్చి 12 : నల్లగొండను, ఎస్ఎల్బీసీని ఎండబెట్టి ఇక్కడి ప్రజలకు తీరని అన్యాయం చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు కట్టి కృష్ణానీటిని దొంగతనంగా తీసుకెళ్లాడని, అలాంటి వ్యక్తి నల్లగొండను అభివృద్ధి చేశాడనడం హాస్యాస్పదమని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కల అయిన తెలంగాణ సాధన విషయంలో గూడు పుఠాణీ చేసి రాష్ర్టాన్ని అడ్డుకున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ ముగియగానే కర్నూల్ వెళ్లి తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌కు వీసా తీసుకొని వెళ్లాల్సి వస్తదని వైస్ మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి గురించి గొప్ప గా చెప్తూ రాజన్న రాజ్యంలో చేసిన అభివృద్ధి తప్ప నల్లగొండకు ఎలాంటి న్యాయం జరుగలేదని షర్మిల మాట్లాడటం అవగాహనా రాహిత్యమే అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చూసి దేశ ప్రజలే కీర్తిస్తుంటే ఏం జరుగలేదని మాట్లాడటం విషయ పరిజ్ఞానం లేకపోవటమే కారణం అన్నారు.
కాంగ్రెస్ హయాంలో పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఆ పార్టీ కార్యకర్తలకే చెందాయి తప్ప సామాన్యులకు అందలేదన్నారు. నేడు పార్టీలతో సంబంధం లేకుండా అన్నివర్గాలకు ప్రతి పథకం అందుతున్న విషయం కనబడటం లేదా? అని ప్రశ్నించారు. అసలు ఆంధ్రాకు చెందిన షర్మిలకు తెలంగాణలో ఏం పని అని మండిపడ్డారు. నోఉద్యోగాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఆలస్యం జరిగిందని, స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు రావాలనే సీఎం కేసీఆర్ ఆరాటపడ్డారని పేర్కొన్నారు. కేబినెట్లో దళిత మంత్రి లేడని మాట్లాడటంలో అర్థం లేదని, కొప్పుల ఈశ్వర్ దళిత మంత్రి అని, సత్య వతి రాథోడ్ గిరిజన మంత్రి అని కూడా తెలియని పరిజ్ఞానం షర్మిలది అన్నారు. సమావేశలో రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఆలకుంట్ల మోహన్‌బాబు పాల్గొన్నారు.