జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు
నేరేడుచర్ల, మార్చి 9 : పశువులకు పోషక విలువలున్న గ్రాసం అందించాలని జిల్లా పశువైద్యాధికారి డి.శ్రీనివాసరావు రైతులకు సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మండలంలోని సోమారం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోదారాములుతో కలిసి ప్రారంభించారు. అనంతరం నేరేడుచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో విపరీతంగా వరి పండిస్తున్నా మిషన్ కోతలతో పశుగ్రాసం కొరత ఏర్పడుతున్నదన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రైతులు పోషక విలువలు కలిగిన పశుగ్రాసాన్ని తమ వ్యవసాయ క్షేత్రాల్లో పెంచుకోవాలన్నారు. సూపర్ నేపియర్ పశుగ్రాసంలో 20శాతం ఖనిజ విలువలు కలిగి ఉంటాయని, ఎకరం భూమిలో 200టన్నుల దిగుబడి లభిస్తుందన్నారు. మొదటి కోత రెండు నెలలకు రాగా ప్రతి పది నుంచి 15రోజులకు ఒకసారి పశుగ్రాసం కోతకు లభిస్తుందన్నారు.
ఒకసారి సాగు చేస్తే ఎనిమిదేండ్లు బహువార్షిక సాగు ఉపయోగపడుతుందన్నారు. పశువులకు ప్రస్తుతం వినియోగించే దాణాలో పదిశాతం ఖర్చు కంటే తక్కువగా వ్యయం అవుతుందన్నారు. ఈ ప్రాంత రైతులు దాణాకు ఇచ్చే ప్రాధాన్యం పశుగ్రాసానికి ఇవ్వట్లేదని, ఈ పరిస్థితతి మారాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ గర్భదారణ చికిత్సలతో మేలైన పశు సంపద పెరుగుతున్నా వాటి సామర్థ్యానికి అనుగుణంగా పాల ఉత్పత్తి జరగకపోవడం పశుగ్రాస లోపమే కారణమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాడపల్లి రమణ, ఎంపీటీసీ వస్కుల మధురవాణి, ఏడీలు శంకర్రావు, వెంకన్న, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల వైద్యాధికారులు రవినాయక్, శ్రీకాంత్, నాగేంద్ర, మార్కెట్ డైరెక్టర్లు, పాడి రైతులు పాల్గొన్నారు.