రామగిరి, ఏప్రిల్ 12 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చకిలం వేణుగోపాల్‌రావు దంపతులు, ధర్మకర్తలు హోమం, ప్రత్యేక పూజలు చేసి రధోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారుల కోలాటం, నృత్య ప్రదర్శనలు, భజనలు, శాస్త్రీయ నృత్యాలు ఆద్యంతం అలరించాయి. పటాకులు కాల్చడంతో ఆకాశంలో మిరుమిట్లు గొల్పుతూ కనువిందు చేశాయి. రథోత్సవంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, కౌన్సిలర్ యామా కవితా దయాకర్ దంపతులు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు పాదం ప్రియాంక, జయప్రద, లక్ష్మీనారాయణ, శ్రీనివాసాచార్యులు, స్వామి, ఆలయ అర్చకులు సముద్రాల యాదగిరాచార్యులు, శఠగోపాలాచార్యులు, రఘునందనాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.