సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
పటాకులు కాల్చి, స్వీట్ల పంపిణీ
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో బుధవారం నిరుద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించగా.. అంతవరకు టీవీల్లో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని చూస్తున్న యువతీ,యువకులు వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొందరు యువకులు తీన్మార్ స్టెప్పులేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. నల్లగొండలోని గడియారం సెంటర్లో టీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ జిల్లా శంకర్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కట్టంగూర్‌లో టీఆర్ఎవ్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శంభయ్య పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు. నార్కట్‌పల్లిలో ఎంపీపీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. చిట్యాల, శాలిగౌరారంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. మిర్యాలగూడలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శోయబ్ ఆధ్వర్యంలో, దామరచర్ల, వేములపల్లి, మాడ్గులపల్లి, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరులోని కేసీఆర్ గుడిలో సీఎం కేసీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్వీ నియోజవర్గ ఇన్చార్జి పిల్లి అభినయ్ ఆధ్వర్యంలో హాలియాతో పాటు సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజుతో పాటు టీఆర్ఎస్ నాయకులు అన్ని మండలాల్లో సంబురాలు జరుపుకున్నారు.