బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావన
ఈ ఏడాదిలోనే ‘డిండి ’ పూర్తికి నిర్ణయం
త్వరలోనే ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభం
కాళేశ్వరం పరిధిలోని ప్యాకేజీ పనులు కూడా..
పాలమూరు ద్వారా జిల్లాలో 30వేల ఎకరాలకు సాగు నీరు
ఎస్ఎల్బీసీ, ఇతర ప్రాజెక్టులపైనా ప్రత్యేక శ్రద్ధ
నల్లగొండ ప్రతినిధి, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి వసతి కోసం చెయ్యని పోరాటమంటూ లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం నిత్యం ఆందోళనలే కొనసాగేవి. నాగార్జునసాగర్ ఆయకట్టులో సైతం సకాలంలో నీటి విడుదల కోసం, ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం, కాల్వల మరమ్మతుల కోసం నిరసనలు జరిగేవి. ఏదైనా ప్రాజెక్టుకు పునాదిరాయి పడినా… పూర్తి కావాలంటే దశాబ్దాల పాటు ఎదురుచూపులు తప్పేవి కాదు. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం ఆ కష్టాలకు చెల్లుచీటి పలుకుతూ.. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నది. ఏటా బడ్జెట్లో అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపును రాష్ట్ర ప్రభుత్వం అంతకంతకూ పెంచుతున్నది. తాజా బడ్జెట్లో సైతం రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.22,675 కోట్లను కేటాయించడం విశేషం. ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సైతం ఈ ఏడాదిలో పూర్తి చేసేందుకు దృఢసంకల్పంతో ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంపై రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సమైక్య రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఆయకట్టు మినహా మరే ప్రాంతానికి సాగునీటి వసతి లేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యానికి తోడు కరువు కాటకాలతో భూగర్భ జలాలు అడుగంటి ఫ్లోరైడ్ భూతం జిల్లాను ఆవరించి దేశంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతంగా మునుగోడు నియోజకవర్గానికి పేరు పడింది. కానీ ఫ్లోరైడ్‌కు విరుగుడుగా సాగునీటి ప్రాజెక్టులపై ఆలోచన చేసిన దాఖలాలు లేవు. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాల కోసం సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో దశాబ్దాలుగా ప్రజలు పోరాటాలు చేస్తూ వచ్చారు. సాగర్ ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. భువనగిరి, ఆలేరు ప్రాంతాలు సైతం సాగునీటి వసతి కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తూ వచ్చాయి. ఇక ఎస్ఎల్బీసీ పూర్తిపైనా నిర్లక్ష్యం కొనసాగింది. వీటన్నింటికీ తోడు జల వసతి ఉందనుకున్న నాగార్జునసాగర్ ఆయకట్టులో సైతం సమైక్య పాలకుల నీటి దోపిడితో సరైన సమయంలో నీటి విడుదల జరిగేది కాదు.
టెయిల్‌పాండ్ భూములన్నీ బీడు భూములుగానే మిగిలిపోయాయి. సాగర్‌లో నీళ్లున్నా ఎడమకాల్వ పొలాలు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఉద్యమ సమయంలోనే ఉమ్మడి జిల్లా అంతటా పర్యటన చేసిన అప్పటి ఉద్యమనేత, ఇప్పటి సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి వసతిపై ప్రత్యేక ప్రణాళికతో ఉన్నారు. అందుకు అనుగుణంగా స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ… అసలు ప్రాజెక్టులకు ఏ మాత్రం అవకాశం లేదన్న ప్రాంతాలకు సైతం సుదూర ప్రాంతాల నుంచి నీటిని తరలించేలా రూపకల్పన చేశారు. ఇవన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో మిగిలి ఉన్న బీడు భూ ములన్నీ సస్యశ్యామలమయ్యాయి. ప్రస్తుతం ఈ జిల్లాలో ఓ వైపు కృష్ణా, మరో వైపు గోదావరి జలాలు,ఇంకోవైపు మూసీ నీటి సాగునీటి వసతి లేని భూమి లేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక వరి సాగు జిల్లాగా సూర్యాపేట చరిత్రకెక్కింది. వరుసగా మూడో ఏటా రెండు పంటలకు సాగునీటితో రికార్డు సాగుతో విస్తీర్ణం పెరిగింది. ఇక నల్లగొండ జిల్లాలో సాగర్ ఆయకట్టుపై స్వరాష్ట్రంలో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. సాగునీటి వాటా వాడుకోవడంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుండడంతో రెండు పంటలకు సమృద్ధ్దిగా నీరు అందుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు మొదలైందంటే చాలూ…వెంటనే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆ నీటిని సాగర్‌కు తరలిస్తూ సీజన్ ప్రారంభానికి ముందే సాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో సకాలంలో సాగునీటి విడుదల జరుగుతుంది. ఇక ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వ మే చేపట్టి ఉచిత కరెంటుతో నిరంతరం సాగునీరు అందించేలా తీర్చిదిద్దింది. నీటి తీరువా సైతం రద్దు చేయడంతో సాగర్ ఆయకట్టు స్వరాష్ట్రంలో కళకళాలాడుతుంది. ఇదే సమయంలో ఎస్ఎల్బీసీతో పాటు దాని పరిధిలోని వరదకాల్వను సైతం ప్రభుత్వం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎస్ఎల్బీసీ సొరంగంపై శ్రద్ధ
2004లో శంకుస్థాపన చేసిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని సైతం అప్పటి పాలకులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్టు పనుల్లో అవరోధాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, రెండేండ్లుగా దీనిపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను కొనసాగిస్తుంది. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో పాటు ఇతర సాంకేతిక అవరోధాలను అధిగమించేలా నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేసింది. దీన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో కృషి చేస్తున్నది. పానగల్ ఉదయసముద్రం ఎత్తిపోతల పనులపైనా దృష్టి పెట్టి కొనసాగిస్తుంది. అయితే సొరంగం తవ్వకంలో వచ్చిన అవరోధాలను అధిగమిస్తూ పనులను నిర్వహిస్తుంది. యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలకు తరలించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మల్లన్నసాగర్ నుంచి బస్వాపూర్, గంధమళ్ల రిజర్వాయర్లకు గోదావరి జలాలను తీసుకువచ్చి సస్యశ్యామలం చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయి. ఇక సాగర్ ఎడమకాల్వ పరిధిలోని చివరి భూములకు సైతం సాగునీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 13 ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది. వీటి పనులు త్వరలోనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తుంది.
బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావన
సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మాణంలో ఉన్న డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీ పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీలను, సాగర్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లోని సుమారు 3.41లక్షల ఎకరాలకు సాగునీరందించే ఆర్.విద్యాసాగర్‌రావు-డిండిఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పరిధిలో పలు రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. కాల్వ లు, ఇతర పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులను సైతం ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇది పూర్తయితే ఫ్లోరైడ్ ప్రాంతమైన మునుగోడుకు సాగునీటి వసతి ఏర్పడనుంది. దీంతో పాటు నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సైతం 70 శాతం పూర్తి చేశామని, మిగిలిన పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వీటిపై కోర్టు కేసులు, ఇతర అవాంతరాలు ఎన్ని ఉన్నా ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో ఉందని స్పష్టం చేశారు.
త్వరలోనే ఎత్తిపోతల పనులు
2021లో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన కృష్ణానదిపై ఎత్తిపోతల పథకాలన్నింటినీ ఈ ఏడాదిలో పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇక యాదాద్రి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ పనులను పూర్తి చేసి గోదావరి జిల్లాలతో సాగునీరు అందించేందుకు తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ఉందని బడ్జెట్లో స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఉమ్మడి జిల్లా అంతటా సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే ప్రతీ ఎకరాకు నీటి వసతి ఏర్పడనుంది. ఇదే జరిగితే ఉద్యమ నినాదానికి సార్ధకం చేకూరి సస్యశ్యామల జిల్లా ఆవిషృతం కానుంది.