నీలగిరి, మార్చి 8 : నల్లగొండ పట్టణాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆస్తి నష్టం జరుగుతున్న వారితో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో పట్టణాభివృద్ధి జరుగుతున్నట్లు తెలిపారు. రాబోయే 40 ఏండ్లకు ఉపయోగపడేలా రోడ్లు విస్తరించాలని, పట్టణంలో సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించినందున ఆ మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పారు. మెడికల్, వెంటర్నరీ కాలేజీలతోపాటు ఎన్జీ కళాశాలను అభివృద్ధి చేస్తున్నామని, పట్టణంలో అత్యాధునిక హంగులతో కళాభారతి, ట్యాంక్‌బండ్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో రోడ్ల వెడల్పు, ఫుట్‌పాత్, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ టవర్స్ తదితర పనులు జరుగుతున్నందున ప్రజలు సహకరించాలన్నారు. ఆస్తి నష్టం జరుగుతున్న యజమానులు పరస్పర భాగస్వామ్యంతో పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. భవనాలు, షాపుల తొలగింపునకు తగిన సమయం ఇస్తామన్నారు. జీఓ 168 ప్రకారం మాస్టర్ ప్లాన్ రూపొందించామని, దాని ప్రకారం రోడ్ల వెడల్పునకు సహకరించాలన్నారు. ఇది ఎవరి వ్యక్తిగతం కోసం కాదని, ప్రజలందరి కోసమని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్‌శర్మ, కమిషనర్ కేవీ రమణాచారి పాల్గొన్నారు.