మన ఊరు.. మన బడితో మారనున్న రూపురేఖలు
తుంగతుర్తి మండలంలో 16పాఠశాలలు ఎంపిక
తుంగతుర్తి, ఫిబ్రవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. సకల వసతులు సమకూరడంతో పాటు ఆంగ్ల విద్య ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి మండలంలో 16 ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మన బడి కార్యక్రమానికి ఎంపికయ్యాయి. అందులో తుంగతుర్తిలో 4, వెలుగుపల్లి 2, రావులపల్లి 2, వెంపటి 2, గొట్టిపర్తి 2, కర్విరాల, సంగెం, అన్నారం, కాశీతండా పాఠశాలలు ఎంపికయ్యాయి. దాంతో ఆయా పాఠశాలలు ప్రైవేటు దీటుగా పోటీపడనున్నాయి. ప్రహరీలు, అదనపు గదులు, మూత్ర శాలలు, తాగునీరు సౌకర్యం కల్పించడంతో పాటు బెంచీలు, కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు.
పెరిగిన అడ్మిషన్లు…
కరోనా మహమ్మారి అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. తాజాగా సీఎం కేసీఆర్ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మన ఊరు.. మన బడి ప్రారంభించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. దాంతో దశాబ్దాల కాలంగా పాఠశాలల్లో తిష్ఠ వేసిన సమస్యలకు పరిష్కారం లభించనుంది. పలు గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, నైపుణ్య కలిగిన ఉపాధ్యాయులు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నారు.
మన ఊరు మన బడితో మరిన్ని సౌకర్యాలు..
మండలంలో మన ఊరు మన బడి కార్యక్రమానికి 16పాఠశాలలు ఎంపిక కావడం శుభపరిణామం. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చొరవ కారణంగా ఎక్కువ పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటన్నింటినీ ప్రత్యేక నిధులతో తీర్చిదిద్ది మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నది. పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య అందుబాటులోకి రావడం వరం.
– బోయిని లింగయ్య, ఎంఈఓ, తుంగతుర్తి