నీలగిరి, జూలై 8 : సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ అసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ అసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స విభాగం, చెవి, ముక్కు గొంతు అపరేషన్ థియేటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి అన్ని ప్రభుత్వ అసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా తీర్చిదిద్దుతున్నారన్నారు. పేదల ఆరోగ్యం పట్ల కేసీఆర్కున్న దార్శనికతకు ఇది చక్కటి నిదర్శనమన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యసేవలు అప్డేట్ అవుతున్నాయని పేర్కొన్నారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని ప్రభుత్వ అసుపత్రిలో నైపుణ్యం కలిగిన డాక్టర్లు, ఆత్యాధునిక వసతులు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు, డాక్టర్లు ఏసీహెచ్ పుల్లారావు, ఆర్ రమేశ్ ఉన్నారు.