నల్లగొండ రూరల్, జూలై 28 : నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం బయో కెమిస్ట్రీ విభాగంలో డాక్టర్ రాజు పాడియా పర్యవేక్షణలో స్ట్రిప్టోజోటోసిన్ ప్రేరిత మధుమేహ ఎలుక మోడల్స్ ను ఉపయోగించి ఇన్ విట్రో, ఇన్ వివో అధ్యయనాల్లో ఇన్సులిన్ నిరోధాన్ని తగ్గించేందుకు ఔషధ లక్ష్యాలుగా పనికి వచ్చే వృక్ష ఆధారిత సమ్మేళనాల స్క్రీనింగ్ గుర్తింపు, లక్షణ నిర్ధారణ అనే శీర్షికతో ఆయన పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో ఏ ఎం పీకే, ఏకేటీ, జి ఎల్ యు టి 4 సిగ్నలింగ్ మార్గాలపై పరిశోధనలు చేయడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలో సహాయపడే వృక్ష సమ్మేళనాలను గుర్తించారు. పలు అంతర్జాతీయ జర్నల్స్ లో తన పరిశోధనలను ప్రచురించడంతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఈ పరిశోధనల ఫలితంగా ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ భానూరి మంజుల, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కరుణ రూపుల చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఓయూ నుండి డాక్టరేట్ సాధించినందుకు గాను యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, కుటుంబ సభ్యులు, స్నేహితులకు శివశంకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గుడిపల్లికి చెందిన శివశంకర్ రెడ్డి ప్రాథమిక విద్య నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెంలో తన అమ్మమ్మ వద్ద ఉండి పూర్తి చేశాడు. ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్ సాధించి హర్యానా రాష్ట్రం కర్నాల్‌లో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జే ఆర్ ఎఫ్ తో పీజీ పూర్తి చేశాడు.