నీలగిరి, ఆగస్టు 10 : ప్రేమ పేరుతో కొంతకాలంగా యువతిని వేధించడమే కాకుండా మంగళవారం జిల్లా కేంద్రంలో ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ప్రేమోన్మాది మీసాల రోహిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణలోని అబ్బాసియా కాలనీకి చెందిన మీసాల రోహిత్ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
అదే కళాశాలలో చదువుతున్న యువతితో స్నేహంగా ఉండేవాడు. చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా అమ్మాయి పట్ల అగ్రెస్సివ్‌గా ప్రవర్తిస్తూ ఆమెను ప్రేమిస్తున్నట్లు కొంత కాలంగా వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఉండి కూడా యువతికి ఫోన్‌చేసి వేధించేవాడు. హైదరాబాద్‌కు ఎప్పుడు వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో కూడా ఇంట్లో వారికి సమాచారం ఇచ్చేవాడు కాదు. గత నెల 29న యువతిని మాట్లాడుకుందాం అంటూ పిలిచాడు. తనను ఎలాగైనా ప్రేమించాలని చెప్పగా ఆమె అంగీకరించక పోవడంతో గాజుసీసాతో బెదిరించాడు.
ఈ విషయాన్ని యువతి హైదరాబాద్‌లో ఉంటున్న తన అన్నకు చెప్పడంతో అతను రోహిత్‌ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకున్న రోహిత్ పథకం ప్రకారం మాట్లాడుకుందాం రమ్మంటూ యువతిని తన స్నేహితుడైన తాయి ద్వారా ఒప్పించాడు. సదరు యువతి తాయితో పాటు తన స్నేహితురాలితో కలిసి మంగళవారం బీటీఎస్లోని ఫారెస్టు పార్కుకు వచ్చింది. అక్కడికి వచ్చిన రోహిత్ తనను పెండ్లి చేసుకోవాలని యువతిని బెదిరించాడు. అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో తాను వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. యువతి అతడిని ప్రతిఘటించడంతో ఆమె కడుపు, చేతులు, కాళ్లు, ముఖం కత్తి గాట్లు పడగా తీవ్ర రక్తస్రావమైంది.
కొద్ది దూరంలో ఉన్న స్నేహితులు అక్కడి రావడంతో రోహిత్ పారిపోయాడు. స్నేహితులే ఆమెను పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ప్రత్యేక దర్యాప్తునకు డీఎస్పీ నర్సింహారెడ్డిని ఎస్పీ ఆదేశించారు. బుధవారం తెల్లవారుజామున నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుతో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, వన్‌టౌన్ సీఐ రౌతు గోపి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ప్రేమోన్మాది దాడిలో గాయపడి జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిని బుధవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, నాయకులు తవిటి కృష్ణ, లోకబోయిన రమణ, కేశబోయిన శంకర్, బోళ్ల వెంకట్, శాగంటి వెంకన్న, గుండెబోయిన లక్ష్మణ్, రామకృష్ణ ఉన్నారు.