నందికొండ, ఆగస్టు 5 : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ జలకళను సంతరించుకుంటున్నది. ఎగువ కృష్ణా పరీవాహక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 2,26,361 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో జల విద్యుత్ కేంద్రాలు, క్రస్ట్ గేట్ల ద్వారా అంతే పరిమాణంలో దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా 63,083 క్యూసెక్కులు, 5 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,39,685 క్యూసెక్కుల నీటిని సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.
నీటి విడుదల కొనసాగుతుండడంతో మరో వారం రోజుల్లో నాగార్జుసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 ( 312 టీఎంసీలు) అడుగుకులకు గాను 565.10 (244.3871 టీఎంసీలు) అడుగులు ఉంది. ఎడమ కాల్వ ద్వారా 2,660 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 1,901 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.70 అడుగులు ఉంది.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా శుక్రవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు నాలుగు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 6,514.90 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 8427.10 క్యూసెక్కులు ఉండగా కుడి కాల్వకు 201.86 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 245.12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 638.10(2.80 టీఎంసీలు)అడుగులు ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.