భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 1 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 17 మండలాల్లోని 161మంది వీఆర్ఓలకు లాటరీ పద్ధతిలో 32శాఖలకు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, వీఆర్ఓల సంఘం సభ్యులు, టీఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకంగా వీడియో చిత్రీకరణతో కేటాయింపులు జరిపామన్నారు.
కేటాయింపుల్లో భాగంగా ఉత్తర్వులు పొందిన వారందరూ తక్షణమే ఆయా శాఖల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ సూరజ్‌కుమార్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, టీఎన్జీఓస్ అధికారుల సంఘం సభ్యులు, వీఆర్ఓల అసోసియేషన్ సభ్యులు, తాసీల్దార్లు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ ఓటరు కార్డుతో ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకోవాలన్నారు.
ఫారం-6బీతో ఓటర్లు తమ ఆధార్ నెంబర్ లేదా ఏదేని 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటి బూత్ లెవల్ అధికారికి అందించి అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, దీపక్ తివారీ, డీఆర్డీఓ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.