తిరుమలగిరి, ఆగస్టు 1 : కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలతో సూర్యాపేట జిల్లా మరోమారు సస్యశ్యామలం కానుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-2 ఆయకట్టుకు సోమవారం నీటిని విడుదల చేశారు. దీని కింద సూర్యాపేట జిల్లాలో 2,13,175 ఎకరాలకు సాగు నీరు అందనుంది. ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, అవసరాన్ని బట్టి పెంచే అవకాశం ఉన్నదని నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఓవీ రమేశ్‌బాబు తెలిపారు.
ఎస్సారెస్పీ నీటి విడుదలతో జనగాం జిల్లాలోని బయ్యన్నవాగు రిజర్వాయర్ నిండి అలుగు పోస్తుంది. దీంతో గోదావరి జలాలు తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద డీబీఎం 69 కాల్వ ద్వారా జిల్లాకు చేరనున్నాయి. నీటి విడుదలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 500కు పైగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోన్నాయి. దీంతో ఎస్సారెస్పీ కాల్వలున్న తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, సూర్యాపేట, చివ్వెంల, కోదాడ మండలాల్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు 42 రోజులపాటు ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలు అందించారు. 2018 అక్టోబర్ 5న అదే పరిస్థితి ఉండడంతో పంటలను కాపాడేందుకు 20 రోజులు నీటిని విడుదల చేసి వందకు పైగా చెరువులను నింపారు. 2019 అక్టోబర్ 20న కాళేశ్వరం ద్వారా వంద రోజులకు పైగా గోదావరి జలాలను విడుదల చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకున్నారు.
ఈ సారి వానకాలం పంట చేతికొచ్చే వరకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఐదు సంవత్సరాల నుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్న ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటుంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చొరవతో అడగక ముందే సాగునీరు అందిస్తున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా నీళ్లు అందిస్తామని, కాల్వలకు గండ్లు పెట్టవద్దని అధికారులు రైతులకు సూచించారు.