ప్రజలకు వైద్యాన్ని ప్రభుత్వం చేరువ చేస్తున్నది. అత్యాధునిక వసతులతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నది. ఇప్పటికే మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన చికిత్స అందుతున్నది. నల్లగొండలో మెడికల్ కళాశాలను కొనసాగిస్తూ జిల్లా కేంద్ర దవాఖానను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ దవాఖానలో 100 నుంచి 300 పడకలకు పెంచనుండగా రెండంతస్తుల భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి జిల్లా దవాఖానకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ట్రామా కేర్ సెంటర్, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు పనులు సాగుతుండగా వివిధ పరికరాల కొనుగోలుకు నిధులు విడుదలయ్యాయి. డాక్టర్లు, వైద్య సిబ్బందిని కూడా కేటాయించనున్నారు.
మిర్యాలగూడ, ఆగష్టు 1 : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని ఆధునీకరించి, సకల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 100 పడకల స్థాయిని 300కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆస్పత్రిని ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతమున్న భవనం రెండో అంతస్తు నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ ఇటీవల ఏరియా ఆస్పత్రిని సందర్శించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గ నిర్దేశం చేశారు.
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం 100 పడకలున్నాయి. ఆస్పత్రికి రోజూ 400 మందికి పైగా ఓపీ సేవలు వినియోగించుకుంటుండగా మరో 100 మంది వరకు ఇన్ పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రి స్థాయిని పెంచే విషయాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండో అంతస్తు నిర్మాణానికి రూ.14 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండో అంతస్తు నిర్మాణం పూర్తియితే మరో 100 పడకలు అందుబాటులోకి రానున్నాయి. పడకల స్థాయిని బట్టి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది సంఖ్య కూడా పెరగనుంది.
ఏరియా ఆస్పత్రికి రోడ్డు ప్రమాద బాధితులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఎముకలు విరిగిన వారికి మెరుగైన చికిత్స చేయడంతో పాటు 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు ట్రామాకేర్ సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి సంబంధించిన పనులు పూర్తికావచ్చాయి. ఈ సెంటర్లో 50 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలబారిన పడిన వారికి ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
గర్భిణులు, చంటి పిల్లలకు చికిత్స అందించేందుకు 50 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రైవేటు దీటుగా ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సామగ్రిని సైతం సిద్ధం చేశారు. చిన్న పిల్లలకు వైద్యం కోసం 20 పడకలతో పీడియాట్రిక్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం కోసం మరో 10 పడకలతో ఐసీయూను కూడా సిద్ధం చేశారు.
ఏరియా ఆసుపత్రిలో నూతన పరికరాలు, వస్తువుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.72 కోట్లు మంజూరు చేసింది. దాంతో పాటు రూ. 98 లక్షలతో విద్యుత్ యంత్రాలు, వైరింగ్ పనులు చేపడుతున్నారు. మార్చురీ గదులు ఆధునీకరణకు మరో రూ.30 లక్షల మంజూరయ్యాయి.
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఆరు బెడ్లతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రెండు షిఫ్టుల్లో డయాలసిస్ చేస్తున్నారు. దాంతో కిడ్నీ బాధితులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.
నల్లగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం, జిల్లా కేంద్ర ఆస్పతిని మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిని మిర్యాలగూడకు మార్చేందుకు వైద్య విధాన పరిషత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన వైద్య విధానపరిషత్ అధికారులు సైతం ఏరియా ఆసుపత్రిని పరిశీలించి జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నా. ఆస్పత్రిని 200 పడకల స్థాయికి పెంచటంతో పాటు వైద్యులు, సిబ్బందిని కూడా పెంచనున్నాం. సీఎం కేసీఆర్ ఆస్పత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరు చేయడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందుతున్నాయి. దాంతో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రం, చైల్డ్ కేర్ సెంటర్, ట్రామాకేర్ సెంటర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
– నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్యే, మిర్యాలగూడ