నల్లగొండ, ఆగస్టు 1: ‘నల్లగొండ అభివృద్ధి నేపథ్యంలో పనుల ఒత్తిడి కారణంగా వార్డుల్లో సమస్యల పరిష్కారంలో కాస్త నిర్లక్ష్యం జరిగింది. త్వరలోనే ప్రతి వార్డును రూ.65 లక్షలతో అభివృద్ధి చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్నంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే ఆరోపణలు సరికాదు. టీఆర్ఎస్ కుటుంబమంతా ఒక్కటే, మాలో చీలికలు లేవు, భవిష్యత్‌లో రాబోవు’ అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.
జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నల్లగొండలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నందున వార్డుల్లో సమస్యలు కాస్త నిర్లక్ష్యం అయ్యాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని మా కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా నిరసన తెలిపారే తప్ప, పార్టీ మారే ఉద్దేశం వాళ్లకు లేదన్నారు.
అయితే ఇదే అదునుగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ మారుతున్నట్లు పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. ఎవరు ఏం చేసినా.. మేమంతా ఒక్కటే కుటుంబమని, కౌన్సిలర్లతో కలిసి నల్లగొండ అభివృద్ధికి తాను చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. అదే విధంగా విలీన గ్రామాల అభివృద్ధికి సైతం నిధులు తీసుకొస్తామన్నారు. ఎవరూ ఊహించని రీతిలో నేడు నల్లగొండ అభివృద్ధి జరుగతున్నదని, త్వరలో మరో రూ.220 కోట్లు తీసుకొచ్చి ప్రతి వార్డులో ఇంటర్నల్ రోడ్లను వేయిస్తామని చెప్పారు.
అనంతరం జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధిలో భాగంగా ఒత్తిడి కారణంగా వార్డుల అభివృద్ధి ఆగిందే తప్ప, వేరే ఉద్దేశం లేదన్నారు. కౌన్సిలర్లందరినీ కలుపుకొని ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో పట్టణాభివృద్ధి చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మరోసారి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యల పరిష్కారం నిర్లక్ష్యం అయ్యిందనే ఉద్దేశంతోనే కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్నామే తప్ప, పార్టీ మారే ఉద్దేశం తమకు లేదన్నారు.
చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో పరిష్కరించుకుంటామని, ఎట్టి పరిస్థితిలో నల్లగొండ పట్టణాభివృద్ధిని ఆపేది లేదన్నారు. కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, పున్న గణేశ్, మారగోని గణేశ్, భాస్కర్, ఆలకుంట్ల మోహన్‌బాబు, ఊట్కూరి వెంకట్‌రెడ్డి, ఖయ్యూంబేగ్, ఇబ్రహీం, ప్రదీప్‌నాయక్, వట్టిపల్లి శ్రీను, పూజితాశ్రీనివాస్ పాల్గొన్నారు.