కోదాడ టౌన్, జూలై 31 : స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నేటి తరం విద్యార్థులు యువత తెలుసుకోవడంతో పాటు స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కోదాడకు చెందిన సోషల్ యాక్టివిటీ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో స్వాతంత్రోద్యమ నాయకుల చిత్రపటాలు, వారి జీవిత చరిత్రల వివరాలతో కూడిన ఫొటో ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా పరిస్థితులు మారుతున్నాయన్నారు.
ఈ తరుణంలో జాతీయ నాయకుల చరిత్రలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశ స్వాతంత్రం కోసం కృషి చేసిన మహనీయులను, వారి చరిత్రలను సేకరించి, వాటిపై ప్రదర్శన ఏర్పాటు చేయడం నిర్వాహకుల దేశభక్తికి నిదర్శనమన్నారు.
స్వాతంత్ర పోరాటంలో తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన నాయకుల త్యాగనిరతిని, దేశ భక్తిని నేటి తరం తెలుసుకుని వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం జాతీయ నాయకుల వేషధారణలో ఉన్న విద్యార్థులకు నిర్వహించిన ఫ్యాషన్ షోలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు గంధం బంగారు, తెలుగు అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు బత్తుల ఉపేందర్, నసీర్ అహ్మద్, నిర్వాహకులు మునీర్, శ్రీనివాస్‌గౌడ్, ఖాజామియా, ముస్తఫా, షఫీ, నజీర్ పాల్గొన్నారు.