నేరేడుచర్ల, జూలై 31 : రైతు బీమా దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయస్సు ఉండి.. జూన్ 22 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తుకు అర్హులని తెలిపారు. బీమా ఉన్న రైతు ఏ పరిస్థితుల్లో మరణించినా నామినీకి ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేయనున్నది. గతంలో బాండ్ పొందిన రైతులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం బాండ్ రాని రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్‌బుక్, రైతు ఆదార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్‌లు, నామినీ సెల్ నంబర్, పూర్తి అడ్రస్ దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. స్వయంగా రైతు మాత్రమే వచ్చి దరఖాస్తును ఇవ్వాల్సి ఉంటుంది. అగస్టు 1వ తర్వాత దరఖాస్తులు ఇస్తే తీసుకునే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు.
జూలై 22వ తేదీలోపు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారే అర్హులుగా పరిగణిస్తారు. వారి దరఖాస్తులను ఆన్లైన్ చేస్తారు. రైతు బీమాకు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం షెడ్యూల్ విధించింది. అగస్టు 1 లోపు దరఖాస్తు చేసుకున్న వారికే బీమా వర్తిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రైతు బీమా కలిగిన రైతులు ఏవైనా మార్పులుంటే వెంటనే సమచారం ఇస్తూ ఆధారాలు అందజేయాలని అధికారులు సూచించారు.
రైతు బీమా దరఖాస్తు అందజేయని, నమోదు చేసుకోని రైతులకు రిస్క్ అయితే రూ.5 లక్షలు వచ్చే అవకాశం ఉండదని, వర్తించదని సోషల్ మీడియా ద్వారా రైతు సమన్యయ సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రైతు మరణించిన తర్వాత వచ్చి ఎంతమంది అధికారులను, ప్రజా ప్రతినిధులను అడిగిన ఏమి చేయలేని పరిస్థితి అని వివరిస్తున్నారు. నిర్లక్ష్యం వీడి రైతు బీమా చేసుకుని దీమాగా ఉండాలని ప్రచారం చేశారు.