తొడిగేందుకు ఉద్దేశించిన ఈ మహా యజ్ఞంలో నాటిన మొక్కలన్నింటినీ బతికించాలని సర్కారు
సంకల్పిస్తున్నది. ఆ మేరకు ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ తప్పనిసరి చేసింది. దాంతో ఆయా శాఖల యంత్రాంగం లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటుతూ, జియో ట్యాగింగ్ చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 శాఖల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ప్రక్రియలో ఇప్పటివరకు 89.95 లక్షల మొక్కలు నాటుకోగా, 42.68 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉండడంతో ఏ ప్రాంతంలో ఎన్ని మొక్కలు నాటింది తెలిసిపోతుంది. నాటిన శాఖలే ఆ మొక్కలను సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఏ శాఖ అయినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సోషల్ ఆడిట్లో గుర్తించి అప్పటివరకు ఆ మొక్కకు పెట్టిన పెట్టుబడిని రికవరీచేయనున్నారు.
అటవీ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఎనిమిదో విడుత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమైంది. 2014 నుంచి గత ఏడాది వరకు ఏడు విడుతల్లో ఉమ్మడి జిల్లాలో 19.50 కోట్లకు పైగా మొక్కలు నాటగా.. ఈసారి 2.07 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పెద్దన్న పాత్ర పొషిస్తుండగా.. మిగిలిన మరో పది శాఖల భాగస్వామ్యంతో ఈ బృహత్తర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. అయితే ఏ శాఖ ఎక్కడ మొక్క నాటుతుందో.. దానికి జియోట్యాగ్ చేసి సంరక్షించాల్సిన బాధ్యత అదే శాఖ తీసుకుంటుంది.
హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించబడడం లేదనే ఉద్దేశంతో గత ఏడాది జియోట్యాగింగ్ అమలు చేసింది. గత ఏడాది అన్ని మొక్కలకు జియోట్యాగ్ జరుగకపోవడంతో లక్ష్యం దెబ్బతింటుందని ఈ సారి ప్రతి మొక్కకూ జియో ట్యాగ్ చేయాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించగా.. ఏ శాఖ ఎక్కడ మొక్క నాటుతుందో ఫొటో తీసి వివరాలు ఆ యాప్‌లో అప్లోడ్ చేయాలి. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎన్ని మొక్కలు నాటారు.. అనేది సదరు యాప్‌లో ఉన్నతాధికారులకు తెలిసిపోవడంతోపాటు అధికారికంగా రికార్డు అవుతుంది. ఈ సారి వంద శాతం మొక్కల నాటింపుతోపాటు సంరక్షణ జరుగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జియో ట్యాగింగ్ వ్యవస్థను పకడ్బందీగా పరిశీలిస్తుంది.
ఎనిమిదో విడుత హరితహారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.07 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగం.. ఇప్పటి వరకు 89.95లక్షల మొక్కలు నాటింది. అందులో 42.68లక్షల మొక్కలకు జియో ట్యాగ్ చేశారు. ఆయా శాఖల లక్ష్యాలు, నాటిన మొక్కలు, చేసిన ట్యాగ్ వివరాలను జిల్లా అటవీ శాఖ యంత్రాంగం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది.
ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో 71.03 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 31.87 లక్షల మొక్కలు నాటి, 15.62 లక్షల మొక్కలకు జియో ట్యాగ్ చేశారు. సూర్యాపేటలో 86.70లక్షల మొక్కల లక్ష్యానికిగాను 36.98లక్షలు నాటి, 18.95 లక్షల మొక్కలకు జియోట్యాగ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 50.06 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 21.10 లక్షలు నాటారు. వాటిలో 8.11లక్షల మొక్కలకు జియో ట్యాగ్ చేసినట్లు ఆయా శాఖల రికార్డులు తెలియజేస్తున్నాయి.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కలిసి మొత్తం 12 శాఖలు మొక్కల నాటింపుతో పాటు పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంది. ఏ శాఖ మొక్క నాటిందో సంరక్షించే బాధ్యత కూడా ఆ శాఖదే. గ్రామాల్లో గుంత తీయడంతోపాటు మొక్క నాటిన తర్వాత పరిరక్షణ, నీటి సరఫరా, వాచర్‌కు వేతనం ఉపాధి హామీ నిధుల నుంచి చెల్లించనున్నారు. ఏ కారణం చేతనైనా మొక్క చనిపోతే, దానికి ఉపాధిహామీ నిధులు చెల్లిస్తే సోషల్ ఆడిట్లో గుర్తించి ఆ నిధులు రికవరీ చేయనున్నారు. రెండేండ్లుగా జిల్లాలో సోషల్ ఆడిట్ జరుగలేదు. ఈ సారి పకడ్బందీగా గుర్తించి రికవరీ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
ఎనిమిదో విడుత హరితహారంలో మొక్కలు నాటడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో పది నుంచి పదిహేను వేల చొప్పున సుమారు 2.85 కోట్ల మొక్కలు పెంచారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో మరో 25 లక్షల పెంచి అందుబాటులో ఉంచారు. ప్రతి మున్సిపాలిటీలోనూ లక్ష చొప్పున మొత్తం 18 లక్షల మొక్కలు పెరుగుతుండగా.. భవిష్యత్ అవసరాల కోసం 30శాతం ఉంచి 70శాతం మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టారు.
జిల్లాలో ఏ ప్రాంతంలో మొక్క నాటినా దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత శాఖదే. పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నాటే ప్రతి మొక్కనూ పంచాయతీ కార్యదర్శుల ద్వారా జియో ట్యాగ్ చేయించి సంరక్షించే విధంగా చర్యలు చేపడుతున్నాం. నల్లగొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో పది వేల నుంచి 15 వేల వరకు మొక్కలు పెంచాం. వాటిని ఆయా ప్రాంతాల్లో ఆగస్టు చివరి నాటికి నాటుతాం. ఈ సారి వంద శాతం మొక్కలు నాటి పరిరక్షించాలని అనుకుంటున్నాం.
– దేప విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ
హరితహారంలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం జరిగితే తప్పనిసరిగా రికవరీ చేస్తాం. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా సోషల్ ఆడిట్ జరుగకపోవడంతో రికవరీ చేయలేదు. ఈ సారి పకడ్బందీగా సోషల్ ఆడిట్ నిర్వహించి రికవరీ చేస్తాం. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
– కాళిందిని, డీఆర్డీఓ, నల్లగొండ