ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన జాతీయ రహదారులు మృత్యుదారులుగా మారుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఎక్కడో ఒకచోట రక్తమోడుతున్నాయి. అత్యంత రద్దీగా హైదరాబాద్ – వరంగల్, హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళ్తుండగా, క్రాసింగ్‌లు, జంక్షన్ల వద్ద ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. స్టడ్స్, స్పీడ్ కంట్రోల్‌కు వైట్ స్ట్రిప్స్, బ్లింకింగ్ లైట్లు వంటివి కూడా ఏర్పాటు చేయకపోడం ఎన్హెచ్ఏఐ నిర్లక్షానికి అద్దం పడుతున్నది. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు చూస్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,117 ప్రమాదాలు జరిగాయి. 484మంది చనిపోగా, 1104 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో 52 మంది చనిపోగా, ఒక్క చౌటుప్పల్లోనే 32మంది మృత్యువాత పడడం తీవ్రతను తేటతెల్లం చేస్తున్నది.జిల్లా మీదుగా హైదరాబాద్ – వరంగల్, హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వరంగల్ హైవేపై బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాలు.. విజయవాడ హైవేపై చౌటుప్పల్ మండలం ఉంది. ఈ రోడ్ల మీదుగా నిత్యం వేల వాహనాలు వెళ్తుంటాయి. జాతీయ రహదారి కావడంతో వాహనాలు కాస్త స్పీడ్‌గానే వెళ్తుంటాయి. సాయంత్రం కార్లు, బస్సులు, ఆటోలు, టూవీలర్స్తోపాటు గూడ్స్ వెహికల్స్‌తో వాహనాల తాకిడి మరింత పెరుగుతుంది. దీంతో క్రాసింగ్‌లు, చిన్న పెద్ద రోడ్లు కలిసే చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా వందల మంది చనిపోతుండగా, వేల మంది గాయాలపాలై దివ్యాంగులుగా మారుతున్నారు.
జిల్లాలోని హైవేలపై ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు నాలుగన్నరేండ్లలో ఐదు మండలాల్లో 1,117 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో వివిధ ఘటనల్లో 484 మంది చనిపోగా, 1104 మంది గాయాలపాలయ్యారు. అయితే.. విజయవాడ హైవేపై చౌటుప్పల్లోనే అధికంగా ప్రమాదాలు, మరణాలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మిగతా నాలుగు మండలాల కంటే చౌటుప్పల్‌లో అధికంగా మరణాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో మొత్తం 52మంది చనిపోగా.. ఇందులో చౌటుప్పల్లోనే 32మంది ప్రాణాలు కోల్పోయారు.
జాతీయ రహదారులపై ఉన్న జంక్షన్లు, క్రాసింగ్‌లు, కూడళ్ల వద్దే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. హైవే కావడంతో మితిమీరిన వేగంతో వాహనాలు రయ్‌మని దూసుకొస్తున్నాయి. స్థానికంగా ఉండే జనాలు రోడ్డు దాటే సమయంలో వాహనాలు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోతున్నాయి. దీంతో రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటే భయాందోళన చెందుతున్నారు. అదేవిధంగా చిన్న, పెద్ద రోడ్లు కలిసే చోట యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పలు క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉంటున్నా.. 24గంటలు కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుందని పోలీసులు వాపోతున్నారు.
జాతీయ రహదారులు కేంద్ర పరిధిలో ఉంటాయి. కానీ ఎన్హెచ్ఏఐ అధికారుల నిర్లక్ష్యంతో వందల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. క్రాసింగ్‌ల వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో భారీగా ప్రమాదాలు జరుగుతున్నా.. నియంత్రణ చర్యలు తీసుకోవడంలేదు. స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా వైట్ స్ట్రిప్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇవి ఉంటే క్రాసింగ్‌కు కొద్ది దూరంలోనే వాహనాలు అందుపులోకి వస్తాయి. ఇక బ్లింకింగ్ లైట్లు, స్టడ్స్, రేడియం స్టిక్కర్లు కూడా కనిపించడంలేదు. క్రాసింగ్‌ల వద్ద లైట్లు కూడా ఉండటంలేదు. దీంతో వాహనం దగ్గరికొచ్చే దాకా వ్యక్తులు కనిపించని పరిస్థితి. అండర్‌పాస్‌ల ఊసే లేదు. సర్వీసు రోడ్లను ఎత్తేశారు. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. నియంత్రణ చర్యలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు ఇచ్చినా కనీసం పట్టించుకోవడంలేదు. టోల్ ఫీజు మాత్రం ఠంఛనుగా వసూలు చేస్తున్నారు.
చౌటుప్పల్ మండల వ్యాప్తంగా 65వ నంబర్ జాతీయ రహదారి సుమారు 15 కిలోమీటర్లు ఉంటుంది. నిత్యం రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుండటంతో ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతున్నాయి. మండలంలోని తూఫ్రాన్‌పేట వద్ద దండు మైలారం, దండు మల్కాపురం, కైతాపురం, ఎల్లగిరి, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి తదితర గ్రామాలు ఉన్నాయి. వీటిలో ధర్మోజిగూడెం, ఎల్లగిరి, తూప్రాన్‌పేట వద్ద దండుమైలారం క్రాసింగ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక వరంగల్ హైవేపై కొండమడుగుమెట్ట జంక్షన్, పాత కలెక్టరేట్ జంక్షన్, సింగన్నగూడెం, రామకృష్ణాపురం చౌరస్తా, వంగపల్లి, శారాజీపేట వద్ద క్రాసింగ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి.
హైవే కావడంతో వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఎలాంటి సూచికలు లేకపోవడంతో క్రాసింగ్‌ల వద్ద కూడా అదే వేగంతో దూసుకెళ్తుంటాయి. క్రాసింగ్‌ల వద్ద రోడ్డు దాటేటప్పుడు పాదచారులను ఢీకొంటున్నాయి. పలు చోట్ల డే టైంలో ట్రాఫిక్ పోలీసులను పెట్టి ప్రమాదాలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ.. క్రాసింగ్‌ల వద్ద స్టడ్స్, వైట్ స్ట్రిప్స్, బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇవి ఉండటం వల్ల వాహనం దూరంగా ఉండగానే అదుపులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది.
– నారాయణరెడ్డి, డీసీపీ, భువనగిరి జోన్
రాంగ్ రూట్లో వచ్చే వాహనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ధర్మోజిగూడెం క్రాస్ రోడ్డు దాటగానే పరిశ్రమల వైవు పెద్ద పెద్ద వాహనాలు రాంగ్రూట్లో వస్తుంటాయి. దీంతో హైదరాబాద్ వైవు వెళ్లాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోని భయమేస్తుంది. రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించాలి.
– పాలెం సుమన్‌గౌడ్, వాహనదారుడు, లక్కారం, చౌటుప్పల్ మండలం
చౌటుప్పల్ రూరల్,జూలై31
జాతీయ రహదారిపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. వాహనాలు ఎంతో వేగంగా వస్తూ భయాన్ని కలిగిస్తున్నాయి. రోడ్డు దాటాలంటే గుండెలు గుభేలు మంటున్నాయి. జాతీయ రహదారులపై కూడళ్ల వద్ద ప్రమాద సూచికలు, నిర్ధిష్టమైన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. ప్రజల విలువైన ప్రాణాలను కాపాడాలి.
-దాసరి శ్రీనివాస్, రాయగిరి, భువనగిరి
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి. జంక్షన్లు, కూడళ్ల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్స్‌తోపాటు రహదారులపై బ్లింకింగ్లను ఏర్పాటు చేస్తే వాహనాల వేగాన్ని కొద్ది మేర నియంత్రించే వీలుంటుంది. జాతీయ రహదారుల సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజల విలువైన ప్రాణాలకు రక్షణ కల్పించాలి. పలు ప్రాంతాల్లోని కూడళ్లలో అండర్‌పాస్‌లను ఏర్పాటు చేయాలి.
– మేకల బాలనర్సింహ, ప్రయాణికుడు, రాయగిరి