మినీ అంగన్వాడీ కేంద్రాలు 300 జనాభా ప్రాతిపదికన ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సర్వే ఆధారంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అర్హత గల మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేయనున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉన్న 401 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 248 కేంద్రాలకు ఈ అవకాశం దక్కనున్నది. ఆయా సెంటర్లలో అంగన్వాడీ టీచర్లకు వేతనం పెరుగడంతోపాటు ఆయాల నియామకం జరుగనున్నది. యాద్రాద్రి భువనగిరి జిల్లాలో 57, సూర్యాపేట జిల్లాలో 82, నల్లగొండ జిల్లాలో 109 ప్రధాన
కేంద్రాలుగా మారేందుకు అర్హత కలిగి ఉన్నట్టు ఐసీడీఎస్ యంత్రాంగం చెప్తున్నది. మహిళల్లో రక్తహీనతను తగ్గించడంతోపాటు బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
నీలగిరి, జూలై 31 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 248 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయనున్నది. ఇందులో పని చేస్తున్న టీచర్ల వేతనాలు పెరగడంతో పాటు ఆయాలను కూడా నియమించనున్నారు. వాటి పరిధిలోని సేవలు కూడా విస్తృతం కానున్నాయి.
జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు తోడు రెవెన్యూ గ్రామాలకు దూరంగా ఆవాసాలున్న తండాల్లో, జనాభా తక్కువగా ఉన్న గ్రామాల్లో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయాఆ కేంద్రాల్లో టీచర్లను నియమించి వారి ద్వారా చిన్నారులు, గర్భిణులకు సేవలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో జనాభా పెరగడంతో మినీ కేంద్రాల సిబ్బంది అధిక జనాభాకు సేవలందించలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయమై ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తడంతో వాటిని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్పు చేయనున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న మొత్తం 401 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 248 కేంద్రాలు అప్‌గ్రేడ్ కానున్నాయి. యాద్రాద్రి జిల్లాలోని 57 మినీ అంగన్వాడీ కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 82, నల్లగొండ జిల్లాలోని 109 కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.
మినీ అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్‌కు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో 300 కుటుంబాలకు పైగా.. అర్బన్ ఏరియాల్లో 400 కుటుంబాలకు పైగా ఉన్న మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ విషయమై ఇప్పటికే సర్వే చేసిన సీడీపీఓలు రిపోర్ట్‌ను జిల్లా కార్యాలయానికి పంపించారు. వాటి ఆధారంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
మినీ అంగన్వాడీ కేంద్రాల్లో టీచరే అన్ని పనులు చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఒక పూట సంపూర్ణ భోజనం వండి పెట్టడం, రికార్డుల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి పూర్వ విద్య అందించడం వంటి పనులు నిర్వహించాల్సి వస్తున్నది. ఒకే టీచర్ అన్ని పనులు చేయడం కష్టంగా ఉండడంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా మెయిన్ కేంద్రాలుగా మార్చాలని వినతులు వచ్చాయి.
దాంతో జనాభా ప్రాతిపదికన మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్‌గ్రేడ్ అయిన కేంద్రాలకు టీచర్‌తో పాటు హెల్పర్‌ను నియమించనున్నది. దాంతో మినీ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మరింత మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. మినీ అంగన్వాడీ టీచర్ వేతనం ప్రస్తుతం రూ.7,800 ఉండగా అప్‌గ్రేడ్ అనంతరం రూ.13,650కు పెరుగనున్నది.
గతంలో ప్రభుత్వం జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో జనాభా పెరిగింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య కూడా పెరగడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు మినీ కేంద్రాల అప్‌గ్రేడ్ తప్పనిసరి. అప్‌గ్రేడ్ అయిన కేంద్రాల్లో హెల్పర్లను నియమిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ప్రక్రియ మొదలు పెడతాం.
– తూముల నిర్మల, నల్లగొండ సీడీపీఓ