యాదాద్రి, జూలై 27 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం స్వామి, అమ్మవార్లకు అర్చకులు గజవాహన సేవ నిర్వహించారు. దేవేరులను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణం జరిపారు. మొదటగా సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు(విహార) సేవ, దర్బార్సేవ చేపట్టారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి తిరువారాధన, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు.
కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. బుధవారం స్వామివారిని 6 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వామివారి ఖజానాకు రూ.8,08,492 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
హైదరాబాద్కు చెందిన ఎస్ఎల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకట్రెడ్డి, వీణారెడ్డి దంపతులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి బంగారు పుష్పాలను సమర్పించారు. 17 గ్రాముల విలువైన రెండు బంగారు పుష్పాలను బుధవారం ఆలయ అధికారులకు అందజేశారు.
స్వామివారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 40,550
వీఐపీ దర్శనం 18,000
వేద ఆశీర్వచనం 7,800
నిత్య కైంకర్యాలు 2,200
క్యారీ బ్యాగుల విక్రయం 7,300
వ్రత పూజలు 16,800
కల్యాణకట్ట టిక్కెట్లు 6,990
ప్రసాద విక్రయం 4,36,060
వాహనపూజలు 5,400
అన్నదాన విరాళం 13,232
శాశ్వత పూజలు 30,000
సువర్ణ పుష్పార్చన 66,200
యాదరుషి నిలయం 22,240
పాతగుట్ట నుంచి 6,990
కొండపైకి వాహన ప్రవేశం 1,25,000
లక్ష్మీ పుష్కరిణి 400
శివాలయం 3,800