సాగు పనుల్లో వేగం పెంచారు. వారంపాటు కొనసాగిన వర్షాలు కూడా తెరిపినివ్వడంతో పొలం బాట పట్టారు. మూసీ ఆయకట్టుకు ప్రాజెక్టు అధికారులు అధికారికంగా సోమవారం నీటిని విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న వరద ఉధృతితో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్నది.
పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 545.30 మేరకు చేరుకున్నది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండడం, సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల వరకు నీళ్లు రావడంతో ఎడమ కాల్వ కింద నీటి విడుదలకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాంతో ఇప్పటికే నారు రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటుండగా, మిగతావాళ్లు డ్రమ్‌సీడర్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు.
రైతులు నిబ్బరం, ధైర్యం, భరోసాతో కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి కావాల్సినన్నింటినీ అందించడమే సంతోషానికి గల కారణాలు. కురిసిన ప్రతి వాననీటి బిందువును ఒడిసి పట్టేందుకు చెరువుల పునరుద్ధరణ.. సకాలంలో ఎరువులు, విత్తనాల అందజేత.. 24గంటల ఉచిత విద్యుత్ వీటితోపాటు అత్యంత ప్రధానమైంది సాగుకు నీరు. గతేడాది నుంచి జిల్లాలో నీటి కరువు అనేదే లేదు. ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతి సీజన్లో పంట పెట్టుబడి సాయాన్ని రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఏడాదికి రెండు సార్లు రూ.5వేల చొప్పున రూ.10వేలు అందిస్తున్నది.
దాంతో అన్నదాత ఇంటసంతోషాలు విరబూస్తున్నాయి. ప్రతిసారి వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుందంటే చాలు అప్పుల కోసం తిప్పలు పడ్డ రైతాంగం ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా సాగు చేస్తున్నారు. ఈ సారి రుతుపవనాలు వచ్చి తొలకరి జల్లులు పడగా జూలై మాసంలో నాలుగైదేండ్లలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉన్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 11.30 ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేదు. ఇప్పటికే శ్రీరాంసాగర్ ఆయకట్టులో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండగా, మూసీ ప్రాజెక్టు ఆధునీకరణతో ప్రతి సంవత్సరం జలకళను సంతరించుకుంటున్నది.
ఇక మరోపక్క కృష్ణా ఎగువన వరద ప్రారంభం కావడంతో నాగార్జునసాగర్ ఆయకట్టుకు కూడా ఏ ఇబ్బందీ లేదు. ఇప్పటికే శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో నాగార్జునసాగర్‌కు ఇన్ ఫ్లో పెరిగి కృష్ణా జలాలు డ్యామ్ క్రస్ట్‌గేట్లను తగిలాయి. ఈ సారి కూడా సాగర్ పూర్తిగా నిండడం ఖాయంగా కనిపిస్తున్నది. మూసీ, గోదావరి ఆయకట్టు అయిన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకర్గాలతోపాటు కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె, నడిగూడెం మండలాల్లో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు.
వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు వరి, పత్తి, కంది తదితర పంటలు కలిపి నల్లగొండ జిల్లాలో 11.28 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 6.08 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. వీటిలో అత్యధికంగా వరి సాగు కానుండగా ఇతర పంటలు పూర్తి కావచ్చాయి.
నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 6.78 లక్షల్లో (60 శాతం) పంటల సాగు పూర్తి కాగా సూర్యాపేట జిల్లాలో 6.08 లక్షల ఎకరాల ఆయకట్టుకుగానూ ఇప్పటివరకు 1.09 లక్షల (20 శాతం) సాగు చేశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 6.44 లక్షల ఎకరాల్లో పత్తి, 5,700 ఎకరాల్లో కంది, 29,208 ఎకరాల్లో జీలుగుతోపాటు మరో 3500 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. సూర్యాపేట జిల్లాలో 81,720 ఎకరాల్లో పత్తి, 5,750 ఎకరాల్లో వరి, 1950 ఎకరాల్లో సోయాబీన్, 10,078 ఎకరాల్లో జీలుగు, 1500 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు.
జిల్లాలో ప్రస్తుతం పంటల సాగులో రైతులు బిజీగా ఉన్నారు. మంచి దిగుబడితోపాటు నాణ్యమైన పంట చేతికి వచ్చే వరకు మండలాల్లో ఉన్న ఏఈఓలు సూచనలను పాటించాలి. వరి పంట వేస్తున్న రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చీడపీడల నుంచి రక్షణ పొందేందుకు సాధ్యమైనంత వరకు రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులనే వాడాలి.
-రామారావునాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట