హాలియా, జూలై 25 : తల్లిదండ్రుల ఒడిలో, చిట్టి చెల్లితో హాయిగా ఆడుకోవాల్సిన వయస్సులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు ఓ బాలుడు. మోయలేని భారం ఒక్కసారిగా వచ్చి పడడంతో తమ కనుల పంటను కాపాడుకునేందుకు దిక్కుతోచని దీనస్థితిలో విలవిలలాడుతున్నది ఆ నిరుపేద కుటుంబం. అనుముల మండలం హాలియాకు చెందిన పాకాల శ్రీనివాస్ యాదవ్-నాగలక్ష్మి దంపతులకు రెండేండ్ల బాబు(చంద్రముఖేశ్), ఏడాది వయస్సున్న కూతురు ఉన్నారు.
శ్రీనివాస్ పండ్ల బండితో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చంద్రముఖేశ్ గత నెలలో జ్వరం బారిన పడడంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అయినా జ్వరం వచ్చి పోతుండడంతో మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆరోగ్యం కుదుట పడక పోవడంతో హైదరాబాద్‌లోని అంకుర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడికి బ్లడ్ క్యాన్సర్‌గా అక్కడి వైద్యులు నిర్ధారించారు. రోజు విడిచి రోజు బ్లడ్, ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి. ఇలా చేసిన ప్రతిసారి రూ.25 వేల వరకు ఖర్చు అయ్యేది.
అంత వ్యయం భరించలేని కుటుంబం హైదరాబాద్‌లోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. అయితే తెల్ల రేషన్‌కార్డులో బాలుడి పేరు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల మేర సహాయం అందే వీలున్నందున ప్రభుత్వం, అధికారులు స్పందించి బాలుడి పేర కార్డు ఇప్పించాలని కోరుతున్నారు. దాతలు ముం దుకు వచ్చి సాయం చేసి తమ కొడుకు ప్రాణాలు నిలుపాలని అర్థిస్తున్నారు.
ఫోన్ పే నంబర్ 8466990787
యూనియన్ బ్యాంక్.
అకౌంట్ నంబర్- 097710100103049. ఐఎఫ్ఎస్సీ-యూబీఐఎన్ 0809772