హాలియా, జూలై 25 : ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే గుండెలమీద కుంపటి పెట్టినట్లుగానే భావించే వారు తల్లిదండ్రులు. ఆడపిల్లను పెంచ డం ఒక ఎత్తయితే, చదువు చెప్పించడంతో పాటు లక్షల రూపాయల కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయడం మరో ఎత్తు. ఇది పేదింటి తల్లిదండ్రులకు భారంగా మారడంతో ఆడపిల్ల వద్దనుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 2014లో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.
రాష్ట్రంలో ఏ ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారు. ఈ పథకాల కింద పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వ కానుకగా లక్షా నూట పదహరు రూపాయలు అందజేస్తున్నారు. అందేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు మహిళలకు ఉచిత విద్యనందజేస్తున్నది. దాంతో ఆడపిల్ల భారం కాదని మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందని తల్లిదండ్రులు అక్కున చేర్చుకుంటున్న పరిస్థితిని కల్పించింది.
నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గత ఏడాది అనుముల, త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, గుర్రంపోడు, మా డ్గులపల్లి మండలాల్లో సుమారు రెండు వేల ఒకవందకు పైగా పెళ్లిళ్లు అయ్యాయి. వీరికి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్‌ల కింద ఒకొక్కరికీ లక్షా 116 రూపాయల చొప్పున అందజేశారు. మొత్తం 2100 పెళ్లిళ్లకుగాను ప్రభు త్వం రూ. 210 కోట్ల, 34 లక్షల 86 వేల విలువైన చెక్కులను అందజేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి
పేదల సంక్షేమమే ధ్యేయగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడు తున్నది. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన లక్షా 116 రూపాయల చెక్కును ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ విధంగా అందజేయడంపై ప్రజల నుంచి హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం లక్షా 116 రూపాయలు ఇవ్వడం గత 75 ఏళ్ల దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన చేస్తుండ్రు.
– నోముల భగత్‌కుమార్, ఎమ్మెల్యే, నాగార్జున సాగర్
బంగారు తెలంగాణ, సబ్బండ వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. 2014లో ప్రత్యేక రాష్ట్రం వచ్చి సీఎం కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. ఏడాదిలో నియోజకవర్గానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ. 210 కోట్లు అందించం హర్షణీయం.
– ఎంసీ కోటిరెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
నేను మూడు నెలల క్రితం నా బిడ్డకు పెళ్లిచేశాను. పెళ్లి అనంతరం కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. నాకు ప్రభుత్వం నుంచి లక్షా 116 రూపాయలు వచ్చాయి. అట్టి డబ్బులను మా ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పేరు చెప్పి చెక్కును అందజేశారు. ఎంతో ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు
-చింతల జయమ్మ, రాగడప, త్రిపురారం మండలం
మాది పేద కుటుంబం. రెక్కాడితేనే డొక్కాడుతుంది. అప్పు చేసి మా తల్లిదండ్రులు నాకు ఇటీవల పెండ్లి చేశారు. నా పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం నుంచి లక్షా 116 రూపాయలను చెక్కు రూపంలో అందించింది. దీంతో మా అమ్మనాన్నలపై అప్పుల భారం లేకుండా పోయింది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మా కుటుంబం అంతా రుణపడి ఉంటాం.
– కోప్పోజు మాధవి, గుర్రంపోడు