నీలగిరి, జూలై 25 : వానకాలంలో వ్యాధులు పొంచి ఉన్నందున గ్రామాల్లో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవల కురిసిన వర్షాలకు డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు శాఖల అధికారులకు కలెక్టర్ పమేలాసత్పతి దిశా నిర్దేశం చేశారు. డెంగీ వచ్చిన ఇంటికి 50మీటర్ల దూరం వరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పల్లెల్లో పారిశుధ్య లోపం లేకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎక్కడా మురుగునీరు నిల్వలు ఉండకుండా జగ్రత్తలు తీసుకోవాలని, ఫ్రై డేను డ్రై డేగా పాటించడంతో పాటు ప్రతి ఆదివారం ఇంటి ఆవరణల్లో చెత్తా, చెదారాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, పాత టైర్లు, కొబ్బరిబొండాలు, కొబ్బరిచిప్పలు, కూలర్లలో నీళ్లు నిలువకుండా చూసుకోవాలన్నారు.
గ్రామస్థాయిలో సిబ్బందితో పనులు చేయించాలని, పారిశుధ్యం సిబ్బందిపై పై స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులు విద్యార్థ్ధులతో కలిసి చేయాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్, ఆయిల్బాల్స్లను నిల్వ ఉంచుకోవాలన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రతి రోజు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగకుండా సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా నుంచి డీఎంహెచ్ఓ డా.అనిమళ్ల కొండల్రావు, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ విష్ణు వర్ధన్‌రెడ్డి, రాజ్‌కుమార్, డా.లచ్చు నాయక్ అధికారులు సల్మాభాను, పుష్పలత పాల్గొన్నారు.