కోదాడ, జూలై 25 : తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ కోదాడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను సోమవారం పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
పట్టణ సీఐ నర్సింహారావు, ఎస్ఐలు రాంబాబు, నాగభూషణం సిబ్బందితో కలిసి ఉదయం పట్టణంలోని ఖమ్మం ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బైక్‌పై ముగ్గురు యువకులు సూర్యాపేట రోడ్డు నుంచి ఖమ్మం రోడ్డు వైపు వెళ్తుండగా అనుమానించిన పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారు. బైక్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు లేక పోవడంతో అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకొన్నారు.
కోదాడ పట్టణానికి చెందిన నాగ దాసరి, కొల్లూరి సాయిప్రకాశ్, మునగంటి గోపి గత కొన్నేండ్లుగా కోదాడ పట్టణంలోని ఎంఎస్ నగర్, భవానీ నగర్, శ్రీమన్నారాయణ కాలనీ, గోపిరెడ్డి నగర్, కట్టకొమ్ముగూడ రోడ్డుతో పాటు వివిధ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న 8 ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. జూన్ 16న ఎంఎస్ నగర్లో భూక్యా పార్వతి ఇంట్లో దొంగతనం చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ముగ్గురి నుంచి 32 తులాల బంగారం, కేజీ వెండి, రూ.1.20 లక్షల నగదు, ల్యాప్‌ట్యాప్, హోండా యాక్టివా, రెండు ఎల్ఈడీ టీవీలు, నాలుగు స్పీకర్లు మొత్తం రూ.20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, పట్టణ సీఐ నర్సింహారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పట్టణ ఎస్ఐలు రాంబాబు, నాగభూషణ్‌రావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి నగదు రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు.