యాదాద్రి, జూన్ 30 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్యోత్సవాలను గురువారం కోలాహలంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం చేసి తులసి దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయంలోని ఉత్తర దిశలో లోపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి ఖజానాకు రూ. 12,16,967 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రీశుడిని రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామి ప్రసాదం అందించారు.
శ్రీవారిని ఏపీకి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులతో గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఏఈఓ దోర్బల భాస్కర్శర్మ స్వామి ప్రసాదం అందించారు.