డిండి, జూన్ 30 : మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు ప్రధాన తూము షట్టర్స్ను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ గురువారం పైకి ఎత్తి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయకట్టు రైతులు వరితోపాటు అవకాశం ఉన్న మెట్ట పొలంలో ఆరుతడి పంటలు వేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నియోజకవర్గంలో లక్షా అరవై వేల ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కొంత ఆలస్యం అయినా.. అందులో భాగంగా చేపట్టిన నక్కలగండి, గొట్టిముక్కల, సింగరాజుపల్లి ప్రాజెక్టుల్లో స్థానికంగా వచ్చే నీటిని నింపుకునేందుకు నిర్మాణ పనుల పూర్తికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. గొట్టిముక్కల, నక్కలగండి ప్రాజెక్టుల పునరావాస పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టు ప్రధాన తూము షట్టర్ రిపేర్ కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. నీటి విడుదల పూర్తి కాగానే షట్టర్ బిగింపు పనులు చేపడుతారని తెలిపారు.