రామగిరి, జూన్ 30 : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్-2022 పరీక్ష గురువారం సజావుగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేయగా 4,745 మంది విద్యార్థులకు 4,220 మంది హాజరయ్యారు. 525 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కన్వీనర్ పి.జానకీదేవి పర్యవేక్షించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే నిబంధన ఉండటంతో విద్యార్థులు ముందస్తుగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఇద్దరు విద్యార్థినులు ఆలస్యంగా రావడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు, స్నేహితులు రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి కనిపించింది.