రామగిరి, జూన్ 30 : అంకితభావం, పట్టుదలతో ఇష్టపడి చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం చాలా సులభమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో ఉద్యోగార్థులకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్నికల కమిషనర్ పలు సూచనలు చేసి ఉద్యాగార్థుల్లో స్ఫూర్తిని నింపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నందున యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత స్థానంలో ఉంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, కుటుంబ జీవనానికి సుస్థిరత లభిస్తుందన్నారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదని, కసితో ఇష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సూచించారు. పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎకానమీ, పాలిటిక్స్, హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల వారీగా చదువాలన్నారు. నల్లగొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిందని తెలిపారు.
చైతన్యవంతమైన జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమాధికారి రాజ్‌కుమార్, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, మైనార్టీ సంక్షేమాధికారి బాలకృష్ణ, తాసీల్దార్ మందడి నాగార్జున్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎన్నికల కమిషనర్‌కు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు.