కుట్రలమారి కేంద్రం కక్ష పూరిత చర్యలతో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న చిరుజీవులంతా అలా రోడ్డెక్కిన వాళ్లే. కేంద్రం కుట్రలతో ఎఫ్‌సీఐ కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను తీసుకోకపోవడం వల్ల ఉమ్మడి జిల్లావాప్తంగా రైస్ మిల్లులు మూతపడ్డాయి. దాంతో పని కోల్పోయిన హమాలీలు, ఇతర కార్మికులు శనివారం మహాధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోనిరామగిరిలో గల ఎఫ్‌సీఐ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎఫ్‌సీఐ సీఎంఆర్‌ను సేకరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
రామగిరి, జూన్ 25: ఎఫ్‌సీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో 2 వేల రైస్ మిల్లులు మూత పడ్డాయని, వాటిని వెంటనే తెరిచి హమాలీలకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 25 రోజులుగా కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించకపోవడంతో హమాలీలు ఉపాధి కోల్పోయారని, వెంటనే బియ్యం సేకరించాలని శనివారం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ కార్యాలయం వద్ద హమాలీలతో మహా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ పనులు నమ్ముకొని బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్ రాష్ర్టాల నుంచి వందలాది కార్మికులు వలస వచ్చారన్నారు. ప్రస్తుతం వారికి పనిలేక స్వస్థలాలకు వెళ్ల్లే పరిస్థితులు దాపురించాయన్నారు. జూన్ మొదటి వారం నుంచి భౌతిక తనిఖీల పేరుతో బియ్యం సేకరణ నిలిపివేయడంతో పనులు నిలిచి పోయినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా దానిని మిల్లుల నుంచి కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉందని వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ఎక్కువ కాలం ధాన్యం నిల్వ చేస్తే రంగు మారి పురుగులు పట్టి నాణ్యత కోల్పోయే అవకాశం ఉందన్నారు.
ధర్నాకు సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఎఫ్‌సీఐ వ్యవహారశైలి ప్రజలతో పాటు రవాణా రంగం, హమాలీ కార్మికులపై పడుతుందన్నారు. అనంతరం ఎఫ్‌సీఐ మేనేజర్‌తో పాటు కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, సాగర్ల యాదయ్య, సుందరయ్య, నగేశ్, రామచంద్రం, రాములు, వీరయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
మునుగోడు : రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల కార్యదర్శి చాపల శ్రీను మాట్లాడుతూ మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయి యజమానులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అనంతరం తాసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో బి.లాలు, దుబ్బ వెంకన్న, బండారి శంకర్, నరేశ్, బొల్లం రాములు, నరసింహ, సైదులు, లింగస్వామి, శ్రీను పాల్గొన్నారు.