హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ కాలేజీల్లోని అధ్యాపకుల పీహెచ్డీ గైడ్షిప్నకు రూ. 5వేల ఫీజు వ్యవహారాన్ని జేఎన్టీయూహెచ్ అత్యంత సీరియస్‌గా తీసుకున్నది. నిబంధనలకు విరుద్ధంగా, వర్సిటీ అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకోవడంతో చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా శుక్రవారం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ చెన్నకేశవరెడ్డిపై బదిలీవేటు వేసింది. ఆయన్ను ఆర్అండ్డీ డైరెక్టర్ పోస్టు నుంచి తప్పించింది. ఈ స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏ సత్య సావిత్రికి ఆర్అండ్డీ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
చెన్నకేశవరెడ్డిని మెకానికల్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా బదిలీచేశారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇచ్చేందుకు వర్సిటీ ఇటీవలే ఓ వెబ్‌నోట్ విడుదల చేసింది. అధ్యాపకులు రూ. 5వేలు ఫీజు కడితే గైడ్షిప్ ఇస్తామని ప్రకటించింది. ఇదే అంశంపై గురువారం ‘ఐదువేలు కొట్టు.. గైడ్షిప్ పట్టు’శీర్షిక పేరిట ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన వర్సిటీ గురువారం నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. తాజాగా ఈ ఉత్తర్వులిచ్చిన ఆర్అండ్డీ డైరెక్టర్‌పై బదిలీ వేటు వేసింది. ఈ నిర్ణయంపై జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రతినిధి జే దిలీప్ హర్షం వ్యక్తంచేశారు.