సినీ వినీలాకాశంలో వెలుగులు జిమ్మిన వెండి తెర చిన్నబోతున్నది. పేద, ధనిక తేడా లేకుండా ఆహ్లాదం పంచిన థియేటర్లు వెలవెలబోతున్నాయి. టికెట్ల కోసం కిక్కిరిసిన క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొవిడ్ పరిస్థితులు నెలకొల్పిన సంక్షోభం మొదలు ఓటీటీ ప్రభావం, పైరసీ భూతం, పెరిగిన టికెట్ ధరలతో టాకీసులు కోలుకోవడం లేదు. దాంతో సిబ్బంది జీతాలు, నిర్వహణ తలకు మించిన భారంగా మారుతున్నదని థియేటర్ ఓనర్లు వాపోతున్నారు. జిల్లాలో 750 సీట్ల సామర్థ్యం ఉన్న థియేటర్లలో పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన రోజైతే 500, ఆ తర్వాత రోజుల్లో 200కు మించి టికెట్లు తెగడం లేదని ఆవేదన చెందుతున్నారు.ఒకప్పుడు ప్రేక్షకులతో కళకళలాడిన సినిమా టాకీసులు కళ తప్పాయి. రంగురంగుల చిత్రాలను ప్రదర్శించిన వెండి తెర నేడు చిన్నబోతున్నది. ఓటీటీ ఫ్లాట్‌ఫాం, పైరసీ భూతం, టికెట్ ధరల పెంపుతో సినిమా థియేటర్లకు రోజురోజుకూ ఆదరణ తగ్గుతున్నది. కరోనా ప్రభావంతో ప్రజలంతా ఓటీటీకి మొగ్గు చూపడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
– యాదాద్రి, జూన్ 25
ఒకప్పుడు సినిమా పోస్టర్లు అంటించుకున్న వాహనం ఊర్లోకి వస్తే జనం ఎగబడి చూసేవారు. చిన్నారులు వెంట తిరిగి కేరింతలు కొట్టేవారు. ఆ టూరింగ్ టాకీస్‌లకు అప్పట్లో భలే ఆదరణ ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణాలు, నగరాల్లో థియేటర్లు వెలిశాయి. తమ అభిమాన హీరోల చిత్రాలు వస్తే చాలు థియేటర్లు జనసంద్రమయ్యేవి. తెరపైన తమ అభిమాన నటీనటులను చూసి అభిమానులు ఈలలు, కేరింతలు కొట్టేవారు. బాక్సాఫీసు కలెక్షన్లతో దూసుకెళ్లేది. ఒకప్పటి ఈ పరిస్థితిని కరోనా మహమ్మారి తలకిందులు చేసింది. నాడు ప్రేక్షకులతో కళకళలాడిన థియేటర్లు నేడు కళ తప్పాయి. జనం లేక థియేటర్ల యజమానులు దివాలా తీస్తున్నారు.
పలువురు ఉపాధి కోల్పోయి ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు.కరోనా కారణంగా అన్ని రంగాలతోపాటు వినోద రంగంపైనా తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్ నిబంధనల కారణంగా నిర్మాతలు సినిమాలు తీయలేకపోయారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సినీరంగంపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో థియేటర్ల మూసివేత అనివార్యమైంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ ధరలను పెంచాలని రాష్ట్ర నిర్మాతల సమితి వినతి మేరకు ప్రభుత్వం గత డిసెంబర్లో జీఓ 21 విడుదల చేసింది.
ఈ మేరకు టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనిష్ఠ ధర రూ.30, గరిష్ఠంగా 70రూపాయలుగా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.50, గరిష్ఠ ధర రూ.150కి పెంచారు. దీంతోపాటు నిర్వహణ చార్జీల కింద నాన్ ఏసీ థియేటర్లు రూ.3, ఏసీ థియేటర్లు రూ.5 వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సబ్స్క్రిప్షన్ల ధరలు అందుబాటులో ఉండడంతో ప్రేక్షకులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్, సీరియళ్లు, సినిమాలకు అలవాటు పడ్డారు. ఈ సమయంలోనే చాలా మంది నిర్మాతలు ఓటీటీ వేదికగా సినిమాలు విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటం, బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీకి ఆదరణ పెరుగుతూ వస్తున్నది.
రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న సినిమాలకు పైరసీ భూతం భారీ నష్టాన్ని, థియేటర్ల యజమానులకు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. పలువురు అక్రమార్కులు పైరసీకి పాల్పడుతుండటంతో సినిమాలు థియేటర్లకు రాకుండానే లీక్ అవుతున్నాయి. విడుదలకు ముందే థర్డ్ పార్టీ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతుండటంతో థియేటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండాపోతుంది.
సినీ ప్రేక్షకులు ఆశించిన మేర థియేటర్లకు రాకపోవడంతో యజమానులకు భారంగా మారింది. నిర్వహణ ఖర్చులూ రాని పరిస్థితి నెలకొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా థియేటర్లపై ఆధారపడి జీవించే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన థియేటర్లు తిరిగి ప్రారంభమైనా ప్రేక్షకులు రాకపోవడంతో యాజమాన్యాలు సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి.
భువనగిరి పట్టణంలో నాలుగు థియేటర్లు ఉండగా కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో ఈ మధ్యనే ఓ టాకీస్‌ను మూసివేశారు. యాదగిరిగుట్టలో కొత్తగా మరో థియేటర్‌ను ప్రారంభించారు. దీంతో జిల్లాలో మొత్తం నాలుగు థియేటర్లు నడుస్తున్నాయి. అయితే.. భువనగిరిలోని ప్రధాన థియేటర్లో 752 సీట్లు ఉండగా గతంలో తమ అభిమాన హీరో సినిమా వస్తే హౌస్‌ఫుల్ కావడంతో ఒక ఆటకు రూ.56 వేల ఆదాయం వచ్చేది.
ఓటీటీ, పైరసీ ప్రభావంతో ఇప్పుడు గిరాకీ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రోజుకు నాలుగు ఆటలు వేసినా వంద సీట్లకు మించి ప్రేక్షకులు రావడం లేదు. రోజుకు రూ.10వేల నుంచి 12వేలు మాత్రమే వస్తున్నాయని థియేటర్ యజమానులు చెబుతున్నారు. నెలకు రూ.50వేల జీతాలు, రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు విద్యుత్ చార్జీలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులు కులుపుకొని నెలకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని థియేటర్ యజమానులు వాపోతున్నారు.
గతంలో సినిమా విడుదల రోజు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్‌కు వచ్చి ఎంతో ఆనంద పడేవారు. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు ఆసక్తి చూపేవారు. వాళ్లను చూసి మాకు కూడా ఉత్సాహం ఉండేది. కరోనాతో అభిమానులంతా ఇంటికే పరిమితమై ఓటీటీ, ఇతర యూట్యూబ్ సినిమాలకు అలవాటు పడటంతో థియేటర్లకు రావడం మానేశారు. దాంతో థియేటర్ల యజమానులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిర్వహణ ఖర్చులూ రాని పరిస్థితి నెలకొంది.
– శ్రీనివాస్‌గౌడ్, మేనేజర్, వసుంధర థియేటర్, భువనగిరి