యాదాద్రి, జూన్ 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తజనుల సందడి నెలకొంది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, మాఢవీధులు, ప్రసాద విక్రయశాలలో భక్తులు సందడి చేశారు. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలబోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు వైభవంగా నిర్వహించారు.
క్యూ కాంప్లెక్స్ చెంత కొలువైన క్షేత్రపాలక ఆంజనేయ స్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షాపరుల మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.40,13,517 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.
శ్రీవారిని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రాకారంలోని అద్దాల మండపంలో వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్‌కుమార్ ప్రసాదం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 3,01,250
వీఐపీ దర్శనం 3,00,000
వేద ఆశీర్వచనం 7,800
నిత్యకైంకర్యాలు 3,500
సుప్రభాతం 1,600
క్యారీబ్యాగుల విక్రయం 5,300
వ్రత పూజలు 2,31,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 39,280
ప్రసాద విక్రయం 12,41,310
వాహనపూజలు 16,600
శాశ్వత పూజలు 1,00,000
అన్నదాన విరాళం 10,84,644
సువర్ణ పుష్పార్చన 1,46,032
లక్ష్మీ పుష్కరిణి 1,200
యాదరుషి నిలయం 1,01,940
పాతగుట్ట నుంచి 48,360
కొండపైకి వాహనాల అనుమతి 3,75,000