రామగిరి, జూన్ 25 : ఎఫ్‌సీఐ కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను తీసుకోకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల రైస్ మిల్లులు మూత పడ్డాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్ బియ్యం సేకరణ చేయకపోవడం వల్ల హమాలీలు ఉపాధి కోల్పోయినట్లు చెప్పారు. దీంతో శనివారం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ వద్ద హమాలీలతో కలిసి నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.
హమాలీ పనులు నమ్ముకుని బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ర్టాల నుంచి వందలాది కార్మికులు రాష్ర్టానికి వలస వచ్చారని, ఎఫ్‌సీఐ తీరుతో ప్రస్తుతం వాళ్లకు పనులు లేక స్వరాష్ర్టాలకు తరలివెళ్లే పరిస్థితులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ మొదటి వారం నుంచి భౌతిక తనిఖీల పేరుతో సేకరణ నిలిపి వేయడంతో పనులు నిలిచిపోయినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుల నుంచి కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఎఫ్‌సీఐ మేనేజర్‌తో పాటు కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, సాగర్ల యాదయ్య, సుందరయ్య, నగేశ్, రామచంద్రం, రాములు, వీరయ్య, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.