Fiber Foods | డయాబెటిస్ తో బాధపడే వారు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వారు తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేలా, శరీరానికి శక్తిని, పోషకాలను అందించేదిగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహరాలను తీసుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాల లాగా కాకుండా ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా అడ్డుకుంటుంది. గ్లూకోజ్ శోషణ నెమ్మదించేలా చేస్తుంది. ఇక ఫైబర్ లో కూడా కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండు రకాలు ఉన్నాయి. డయాబెటిస్ ఉన్న వారు రోజుకు 22 నుండి 35 గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఫైబర్ ను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది, శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకోదగిన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ తో బాధపడే వారు అవకాడోను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాదాపు 100గ్రాముల అవకాడోలో 6.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ తో పాటు అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. ఈ కొవ్వులు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయి. మధుమేహంతో బాధపడే వారికి అవకాడో ఒక మంచి పండు అని చెప్పవచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లల్లో చక్కెరలు తక్కువగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. 100గ్రాముల రాస్ప్బెర్రీల్లో 6.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అదేవిధంగా పియర్స్ ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తొక్కతో తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మధ్యస్థంగా ఉండే ఒక పియర్ పండును తినడం వల్ల దాదాపు 6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. మధుమేహ నిర్వహణకు ఈ పండు ఎంతో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక డయాబెటిస్ తో బాధపడే వారు బ్రోకలీని కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు బ్రోకలీలో 2.2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బ్రోకలీని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి, శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. పచ్చిబఠాణీల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు పచ్చిబఠాణీలలో దాదాపు 8.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కనుక భోజనంలో వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అదే విధంగా డయాబెటిస్ ఉన్న వారు ఓట్స్ ను, బార్లీని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ శోషణను, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు ఉడికించిన బార్లీలో 6 గ్రాములు, అరకప్పు ఓట్స్ లో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. చక్కెర స్థాయిలల్లో వచ్చే హెచ్చుతగ్గులు రాకుండా నివారించవచ్చు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.