భువనగిరి అర్బన్, జూన్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశ్నిస్తారని తెలంగాణపై బీజేపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేఖ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరించి కొనుగోలు చేసిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులే ప్రస్తుతం బీజీపీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. అధికారంలో లేని రాష్ర్టాల్లో తాము అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు. 2016లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొదలై 2022లో మహారాష్ట్ర సర్కార్ను కూల్చివేయడం వరకు బీజేపీ కీలకపాత్ర వహించిందన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ బీజేపీ నాయకులకు కనిపిస్తాలేదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వకుండా మీటర్లు బిగించి ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై మరింత భారం మోపింది నిజం కాదా అని ప్రశ్నించారు.
కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైన టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు దూష్పాచారాలు మానుకోవాలన్నారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య పాల్గొన్నారు.