బొడ్రాయిబజార్, జూన్ 23 : ప్రభుత్వ పథకం ఏదైనా వారి భాగస్వామ్యం తప్పని సరి. శాఖ ఏదైనా ఒక పని అప్పగిస్తే 100 శాతం విజయవంతం చేస్తారు. వారే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆర్పీలు. మహిళా సంఘాలతో ఎంపికయ్యే వీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటూ అనేక పనులు చేపడుతున్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే రిసోర్స్ పర్సన్లు ప్రభుత్వ ఉద్యోగులకు తీసిపోని విధంగా పని చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోగా ప్రతి ఇంటికీ వెళ్లి కొవిడ్ టీకాపై అవగాహన కల్పించి వంద శాతం వ్యాక్సినేషన్లో భాగస్వామ్యమయ్యారు. కరోనా థర్డ్‌వేవ్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేలో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించారు.
పట్టణాల్లో ఇండ్ల జియో ట్యాగింగ్లోనూ పనిచేశారు. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించేలా కృషి చేస్తున్నారు. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా వీధి విక్రయదారుల సర్వే నిర్వహించి వారికి రుణాలు అందించేందుకు సహకరించారు. ఇవే కాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలల్లో చైతన్యం నింపారు.
టెలీ స్వాభిమాన్‌లో భాగంగా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారాన్ని విజయవంతం చేయడంలో ముందున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయడం, నాటించడం వంటివి చేపడుతున్నారు. ఇటీవల జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 219 మంది మెప్పా ఆర్పీలు ఉన్నారు. సూర్యాపేట పట్టణంలో 98, కోదాడలో 52, హుజూర్‌నగర్‌లో 38, తిరుమలగిరిలో15, నేరేడుచర్లలో 16 మంది పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.4 వేల గౌరవ వేతనంతోపాటు మహిళా సమాఖ్య నుంచి రూ.2 వేలు అందుతున్నది.
మహిళలకు డబ్బు పొదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాం. పది మంది మహిళలతో ఒక గ్రూపును ఏర్పాటు చేసి వారికి బ్యాంకు రుణాలు ఇప్పించడం, తిరిగి సక్రమంగా కట్టేలా చూస్తున్నాం. రుణాలు వినియోగించుకొని మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారు. ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే పలు కార్యక్రమాల్లో విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది.
– కోల మంగ, మెప్మా ఆర్పీ, సూర్యాపేట
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆర్పీలుగా పని చేస్తూ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాం. ఫీవర్ సర్వే చేశాం. హరితహారం కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం నింపి ఇంటింటికీ తిరిగి మొక్కలు పంపిణీ చేస్తున్నాం.
-కేసవరపు నాగలక్ష్మి, మెప్మా ఆర్పీ, సూర్యాపేట