ఉన్న గ్రామాల్లో వైద్య సేవలందించేందుకు బీబీనగర్‌లోని ఎయిమ్స్ ప్రత్యేకంగా మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ఆరోగ్య రథం పేరిట ఏర్పాటు చేసింది. అందులో వైద్య సిబ్బంది వెళ్లి ప్రజలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. రెండు నెలలకు పైగా విజయవంతంగా సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికి చికిత్స చేశారు.
– బీబీనగర్, జూన్ 23
ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ యూనిట్ వాహహనం ఆరోగ్య రథాన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎయిమ్స్‌కు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం గ్రామాల్లో సేవలందిస్తున్నారు. వీటితోపాటు స్థానిక బీబీనగర్ మండల కేంద్రంలోనూ చికిత్స అందిస్తున్నారు. కొయ్యలగూడెం, పుట్టగూడెం, జనంపల్లి, వచ్యతండా, మురిపిరాల గ్రామాలతోపాటు బీబీనగర్ మండల కేంద్రాన్ని ఎంచుకొని ప్రతి నెలలో రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్య రథంలో ఎయిమ్స్ వైద్య సిబ్బంది 8 మందితోపాటు ఒకరు స్థానిక పీహెచ్సీ సిబ్బంది, ఒకరు ఆశ కార్యకర్త వెళ్లి వైద్య శిబిరంలో పాల్గొంటారు. ఇందులో ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, పీడియాట్రిక్ తదితర పరీక్షలు చేయడంతోపాటు మందులను కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆరు గ్రామాల్లో సుమారు వెయ్యి మందికిపైగా రోగులకు వైద్య సేవలు అందించారు. మొబైల్ మెడికల్ యూనిట్ వాహన ఇన్చార్జి, డాక్టర్ రష్మీ కుందాపూర్ ఆధ్వర్యంలో డాక్టర్లు భూషణ్ కాంబల్, కిశోర్ యాదవ్, శివరాం, సాయి ప్రసాద్ వైద్య పరీక్షలు చేస్తున్నారు. గ్రామాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా సేవలు అందించడంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షలు చేయించుకుని పలు వ్యాధుల బారి నుంచి కోలుకున్నామని ఆయా గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు.
దవాఖానకు పోలేని పరిస్థితిలో డాక్టర్లు మా ఊరికి వచ్చి రెండు సార్లు పరీక్షలు చేసిండ్రు. మందులు కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ డాక్టర్లు ఇచ్చిన మందులతో దమ్ము రోగం తొందరగా నయమైంది. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించింది. దవాఖానలకు తిరిగే బాధ, మందుల ఖర్చు తప్పింది. సంతోషంగా ఉంది.
-మల్లయ్య, బీబీనగర్
ఎయిమ్స్ ద్వారా ప్రతి గ్రామానికీ మెరుగైన వైద్యాన్ని అందించేందుకు మొబైల్ మెడికల్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. గ్రామాల నుంచి దవాఖానకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి రావడంతో కొన్ని గ్రామాల్లో ఈ సేవలు ప్రారంభించాం. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో నెలకు రెండుసార్లు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన వారు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలి.
– వికాస్ భాటియా, ఎయిమ్స్ డైరెక్టర్