నకిరేకల్, జూన్ 23 : తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడేవారని, సీఎం కేసీఆర్ పాలనలో ఆ పరిస్థితి మారి నేడు రెండు పంటలు పండిస్తూ రైతులు ఆనందంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం నకిరేకల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కమిటీ చైర్మన్‌గా ప్రదీప్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా పోగుల నర్సింహ, డైరెక్టర్లుగా గునుగుంట్ల సత్యనారాయణ, దేవిడి ప్రభాకర్‌రెడ్డి, కల్వాని లింగయ్య, వడ్డె సైదిరెడ్డి, పొన్న అంజయ్య, కత్తుల నరేందర్, కన్నెబోయిన మంగమ్మ, చిలుకూరి గోవర్ధన్, పల్లెబోయిన లెనిన్, మన్నెం లక్ష్యయ్య, తొనుపునూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, ఎరువులు, విత్తనాలు దొరక్క ఒక్క పంట సైతం పండేది కాదన్నారు. ఈ ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో జీవిస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇతర సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికీ చేరుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 25 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశమే కాదు.. ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపారని తెలిపారు. 65 ఏండ్లలో కాంగ్రెస్ నాయకులు దేశాన్ని నాశనం చేశారని నరేంద్రమోదీకి అవకాశం ఇస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితి మారిందన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచాడని దుయ్యబట్టారు. గుజరాత్ లాగా తెలంగాణలో కరెంట్ కోతలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తుండని విమర్శించారు. దేశంలో ప్రజస్వామ హక్కులను కాలరాసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఇతర రాష్ర్టాలను అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేకుండాపోయిందన్నారు. రాష్ట్రంలోనే ఆ పార్టీకి చెందిన నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
నకిరేకల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. వారంలో ఎక్కువ రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. చిరుమర్తి ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా నియోజకవర్గంలో రోడ్లు, కాల్వల మరమ్మతులు చేయాలని సంబంధిత మంత్రులను కలుస్తూ నిధులు వచ్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు, వ్యాపారస్తులకు మధ్య వారిధిగా ఉంటూ అన్నదాతలకు లబ్ధి చేకూరే విధంగా చూడాలని ఎమ్మెల్యేకు మంత్రి సూచించారు. ఎళ్లవేళలా రైతులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం రైతులతో మమేకమవుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, అగ్రికల్చర్ ఏడీ శ్రీధర్, తాసీల్దార్ ప్రసాద్‌నాయక్, స్పెషల్ గేట్ సెక్రెటరీ శ్రీనాథ్‌రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న తనపై కొందరు కావాలని పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ తమ అనుకూల పత్రికల్లో కథనాలు రాయిస్తూ, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బురుదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. తామేంటో చూపిస్తాం. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే.
– ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ పట్టణాన్ని నంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం. నూతనంగా ఎన్నికైన ప్రదీప్‌రెడ్డి కేతెపల్లి, కట్టంగూర్, నకిరేకల్ మండలాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేశాడు. ఆ ఫలితమే ఈ చైర్మన్ పదవి. పార్టీలో కష్టపడి పని చేసేవారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని, నకిరేకల్‌లో చిరుమర్తిని మరోసారి భారీ మెజార్టీతో గెలుపించుకుంటాం. సుమారు రూ.25 కోట్ల నిధులతో త్వరలో నకిరేకల్ పట్టణ రూపురేఖలు మారనున్నాయి.
– ఎంపీ బడుగుల లింగయ్య
నూతన కమిటీ గ్రామాల్లో తిరుగుతూ రైతుల సమస్యలు తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కంకణం కట్టుకున్నారు. కొత్తగా ఎన్నికైనా కమిటీకి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి.
– మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్