టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆలేరు నియోజకవర్గంలోని ఉద్యోగార్థులకు రెండు నెలలుగా ఇప్పిస్తున్న ఉచిత శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు 11 అంశాలతో కూడిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. శిక్షణ పొందిన యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికతో చదివి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు.
ఆలేరు రూరల్, జూన్17 : ప్రణాళికతో చదివితే కొలువును సులువుగా సాధించవచ్చని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు మార్కెట్‌యార్డులో గత రెండు నెలలుగా నిర్వహించిన పోటీ పరీక్షల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంత మంది పోటీలో ఉన్నా గెలువాలనే లక్ష్యం దిశగా చదివితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయన్నారు. పోటీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించనున్నదని తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని సూచించారు. అనంతరం 11రకాల అంశాలతో కూడిన స్టడీ మెటీరియల్‌ను శిక్షణ పొందిన ఉద్యోగార్థులకు అందజేశారు.
బలాలు, బలహీనతల ఆధారంగా ఆయా సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించుకోవాలని నిపుణ ఇన్చార్జి కేవీ శర్మ అన్నారు. రేపే పరీక్ష ఉందన్న భావనతో సిద్ధం కావాలని సూచించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు, నమస్తే తెలంగాణ నిపుణను ఫాలో అయితే విజయం సులభమవుతుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో పీజేఆర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ జగదీశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మోటకొండూరు జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లందుల మల్లేశ్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మామిడాల నర్సింహులు, పత్తిపాటి మంజుల, గుంటి కృష్ణ, స్వామి, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు బైరి మహేందర్, పూల శ్రవణ్, కూతాటి అంజన్‌కుమార్, ఎమ్మె కల్యాణ్, ఎండీ ఫయాజ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు పాల్గొన్నారు.