సన్నగిల్లిన నమ్మకంతో చిన్నచూపు చూసిన వారే నేడు సర్కారు స్కూళ్లను ఆసక్తిగా గమనిస్తున్నారు. కారణం.. కండ్ల ముందే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుండడం.
భారమైనా, దూరమైనా వేలకు వేలు పోసి పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులు ఇప్పుడు ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కారణం.. ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రావడం.
సౌలత్లు లేక నిరాదరణకు గురైన పాఠశాలలు సకల సౌకర్యాలను, శాశ్వత నిర్మాణాలను సమకూర్చుకుంటున్నాయి. ఇది.. మన ఊరు – మన బడి ఫలితం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి విప్లవాత్మక
మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు జవసత్వాలను ఇవ్వడం, ఆంగ్ల మాధ్యమం అమలుచేస్తుండడం విదార్థులు, తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షిస్తున్నది. నిపుణులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య ఉచితంగా అందుతుంటే ప్రైవేటుకు ఎందుకు పరుగులు తీయడమన్న ఆలోచన పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడ్రోజుల అడ్మిషన్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు 2,616 మందివిద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడ్రోజులే అయిననేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరుగనున్నది.గతంలో సర్కారు బడులు సమస్యల నిలయాలుగా ఉండేవి. ఇంగ్లిష్ మీడియం లేకపోవడం, వసతుల లేమి, సక్రమంగా లేని విద్యా బోధనతో పేదలు సైతం వేలకు వేలు ఫీజులు పోసి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చి ‘మన ఊరు-మనబడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పిస్తున్నది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి బడి బాట కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నది. దీంతో ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు దీటుగా సకల వసతులతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్కారు బడులు సర్వాంగ సుందరంగా మారాయి. సమస్యలను పరిష్కరించి అన్ని సౌకర్యాలు కల్పించారు. జయశంకర్ బడి బాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ఇంటింటికీ తిరిగి ఆంగ్ల మాధ్యమంలో విద్య, సౌకర్యాలు, బోధనా పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ గురించి అవగాహన కల్పించారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు.
సర్కారు బడుల ప్రాధాన్యతను వివరిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన బడి బాట కార్యక్రమం ఈ నెల 30వరకు కొనసాగనుంది. విద్యాశాఖ సూచించిన షెడ్యూల్లో భాగంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఆంగ్ల మాధ్యమం, బోధనా పద్ధతులు, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో క్రేజీ పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించలేక పెద్ద సంఖ్యలో తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పిస్తున్నారు. అటు అంగన్వాడీ కేంద్రాల నుంచి పలువురు చిన్నారులను స్థానిక పాఠశాలల్లో జాయిన్ చేస్తున్నారు.
ఈ నెల 3న ప్రారంభమైన బడిబాటలో ఇంటింటికీ తిరుగుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,215 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. నల్లగొండ జిల్లాలో 2,214, సూర్యాపేటలో 2,312, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3,689 మంది చేరారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల నుంచి 4,263మంది, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 2,616 మంది, నేరుగా వచ్చిన చేరిన వారు 1,336 మంది విద్యార్థులు ఉన్నారు. గురువారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 1,327మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,123 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో నల్లగొండ జిల్లాలో 1,488, సూర్యాపేటలో 920, యాదాద్రి భువనగిరి జిల్లాలో 715 పాఠశాలలున్నాయి. వీటిల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 4లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖాధికారుల గణాంకాలు తెలియజేస్తున్నాయి.
విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బడిబాట నిర్వహిస్తున్న క్రమంలో నేరేడుగొమ్ము ఆశ్రమ పాఠశాలలో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయి.
– లింగయ్య, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం, నేరేడుగొమ్ము (-చందంపేట)
పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన గొప్ప వరం ఆంగ్లమాధ్యమం. మా పాఠశాల పరిధిలో ఎస్ఎంసీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో ఆంగ్లమాధ్యమంపై అవగాహన కల్పించి చైతన్యం చేస్తున్నాం. మా పాఠశాల కూడా మన బస్తీ -మనబడి కార్యక్రమానికి ఎంపిక కావడంతో ఎంతో మారింది. ఇక్కడి వసతులను చూసి తల్లిదండ్రులు సొంతంగా వచ్చి పిల్లలను చేర్పిస్తున్నారు.
– తరాల పరమేశ్, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీఎస్, కతాల్‌గూడ, (-రామగిరి)
నేను ఇప్పటి వరకు నల్లగొండలోని సంస్కృతి స్కూల్‌కు వెళ్లా. అక్కడ ఫీజులు బాగా వసూలు చేస్తున్నారు. మా అమ్మనాన్మలు ఆలోచించి కతాల్‌గూడ గవర్నమెంట్ బడికి నన్ను, తమ్మున్ని, చెల్లెను తీసుకొచ్చి ఈ బడిలో ఇంగ్లిష్ మీడియం ఉండటంతో చేర్పించారు. ఈ బడి, పచ్చని చెట్లతో మంచిగా ఉంది. టీచర్ల చాలా బాగా పిలుస్తున్నారు. అందుకే ఈ బడిలోనే చదువుతా. మాదోస్తులకు కూడా ఈ బడికి రావాలని చెప్తా.
– అబ్దుల్ రెహ్మాన్, 5వ తరగతి, కతాల్‌గూడ ( -రామగిరి)
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,123 ప్రభుత్వ పాఠశాలలుండగా మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమానికి తొలి విడుతలో 1,097 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 517 ఉండగా 73 పాఠశాలల్లో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా మరో 132 పాఠశాలల్లో మొదలు కావడానికి 15శాతం నిధులు కేటాయించారు. సూర్యాపేట జిల్లాలో 329 పాఠశాలలను ఎంపిక చేయగా 60 పాఠశాలల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 251 ఎంపిక చేయగా 30 పాఠశాలల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నా పేరు బండారు మనోజ్ఞ. నేను ఇంతకుముందు చౌటుప్పల్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌కు వెళ్లేది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఇక్కడ చేరాను. ఈ పాఠశాలలో పెద్ద ఆట స్థలం, తరగతి గదులు, పచ్చని చెట్లు మంచిగా ఉన్నాయి. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇస్తారని చెప్పారు. ఒత్తిడి లేకుండా టీచర్లు పాఠాలు చెప్తున్నారు. ప్రైవేటు స్కూల్ కన్నా ఇక్కడే చాలా బాగుంది.
– బండారు మనోజ్ఞ, 5వ తరగతి, తాళ్లసింగారం (- చౌటుప్పల్, రూరల్)
ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నా. అక్కడ నెలనెలా డబ్బులు కట్టాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ చదువు చెబుతారని సార్లు చెప్పడంతో మా నాన్న ప్రభుత్వ బడిలో చేర్పించాడు. ఇక్కడ ఇంగ్లిష్ మంచిగా చెప్తున్నారు. మాకు నెలనెలా డబ్బులు చెల్లించేది తప్పుతుంది. అందుకని ఇక్కడే చదువుకుంటా.
– రాయుడు, 5వ తరగతి, (-భువనగిరి అర్బన్)
మాకు ముగ్గురు పిల్లలు. పెద్దోడు 5, చిన్నోడు 2, బిడ్డ ఒకటో తరగతి. ఇప్పటి వరకు నల్లగొండలోని సంస్కృతి స్కూల్లో చదివించాం. ఈ ఏడాది నుంచి మా ఊరి గవర్నమెంట్ బళ్లో ఇంగ్లిష్ మీడియం
చెప్తారని తెలిసి ఇప్పుడు ఇక్కడే చేర్పించాం. చుట్టూ చెట్ల మధ్య బడి వాతావరణం బాగుంది. ఫీజుల భారంతప్పింది.
– షాహెదా, కతాల్‌గూడ, నల్లగొండ
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. గురువారం ఒక్క రోజే 49 అడ్మిషన్లు వచ్చాయి. అందులో పది మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన వారే. మూడ్రోజుల్లో 120 మంది విద్యార్థులు చేరారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరాములు తెలిపారు.