ఆసరా పింఛన్, మెడికల్ కాలేజీ వల్లే ఇన్నాళ్లూ బతికి ఉన్నామంటూ కండ్ల నీళ్లు తీసిన దంపతులు ఆరు పదుల దాంపత్య బంధం. ఆయనకు ఆమె తోడు. ఆమెకు ఆయనే ధీమా. పిల్లలు లేరన్న లోటు తప్ప ఉన్నంతలో సంతోషంగా బతికారు. పదిహేనేండ్ల క్రితం పక్షపాతం వారి జీవితాన్ని చీకట్లోకి నెట్టింది. ఆయన మంచానికి పరిమితమయ్యాడు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ వచ్చే కూలితో ఆమె ఆయన బాగోగులు చూసుకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఆమెకు కూడా ఆరోగ్యం సహకరించడం లేదు.
చుట్టూ శూన్యం. తెలియని దైన్యం.నా అనే వారులేక నిస్సహాయ స్థితిలో బుధవారం ఆ అవ్వ సూర్యాపేటలోని మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంప్ ఆఫీసుకు వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాన్వాయ్‌లో బయల్దేరిన మంత్రి దీనంగా ఉన్న ఆమెను చూసి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆమె బాధ విని.. ‘మీ ఇంటికే వస్తాను, నిశ్చింతగా వెళ్లండమ్మా’అని భరోసా ఇచ్చారు.
గురువారం.. మధ్యాహ్నం 3 గంటలు. చెప్పినట్టే, మంత్రి జగదీశ్‌రెడ్డి తాళ్లగడ్డలోని చవగోని లక్ష్మమ్మ, కృష్ణయ్య దంపతుల ఇంటికి వెళ్లారు. మంచం పట్టిన పెద్దమనిషిని పరామర్శించారు. అవ్వను ఓదార్చారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే బాధ్యతను స్థానిక కౌన్సిలర్‌కు అప్పగించారు.
కేసీఆర్ సార్ ఇస్తున్న రెండు వేల పింఛన్, రేషన్ బియ్యం, సూర్యాపేట మెడికల్ కాలేజ్ వల్లే తాము ఇన్నాళ్లు బతికి ఉన్నామని ఆ వృద్ధ దంపతులు కండ్ల నీళ్లు తీస్తూ మంత్రికి తెలిపారు. తమను ఏదైనా ఆశ్రమంలో చేర్పించాలని కోరారు. చలించిన మంత్రి స్పందిస్తూ ‘మీ బాధ్యత నాది.. భయపడకండి’ అని భరోసానిచ్చారు. మంత్రి గుంటకండ్ల చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : నా అన్న వారు లేక ఒంటరిగా ఉంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతులకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అండగా నిలిచారు. గురువారం వారి ఇంటికే వెళ్లి పరామర్శించారు. వారికి వైద్యం అందించే బాధ్యతను స్థానిక కౌన్సిలర్‌కు అప్పగించడంతో పాటు శేష జీవిత బాధ్యతను తాను తీసుకున్నారు. వివరాలు.. సూర్యాపేట పట్టణంలోని 28వ వార్డు తాళ్లగడ్డలో నివాసం ఉంటున్న చవగోని లక్ష్మమ్మ, కృష్ణయ్య దంపతులకు సంతానం లేదు.
కృష్ణయ్యకు ప్రస్తుతం 90, లక్ష్మమ్మకు 80 ఏండ్లు ఉంటాయి. కృష్ణయ్య పదిహేనేండ్ల క్రితం పక్షవాతానికి గురి కాగా లక్ష్మమ్మ చిన్నా చితకా పనులు చేసుకుంటూ వచ్చిన కూలితో కుటుంబాన్ని నెట్టుకొస్తూనే.. మంచానికి పరిమితమైన భర్తకు సేవలు చేస్తున్నది. ప్రస్తుతం ఆమె వయోభారం కారణంగా పని చేయలేని పరిస్థితిలో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ డబ్బులు, రేషన్ బియ్యమే ఆధారమయ్యాయి. బుధవారం లక్ష్మమ్మ మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లింది. అప్పటికే తన కాన్వాయ్‌లో బయల్దేరుతున్న మంత్రి దీనంగా ఉన్న ఆమెను చూసి కాన్వాయ్ ఆపారు. ఆమె వద్దకు వెళ్లి పలుకరించారు.
ఇన్ని రోజుల పాటు అందరూ తమ బాధలు చూస్తున్నా, ఎవరూ పట్టించుకోలేదు.. మొదటి సారి ఏంకావాలని అని అడిగిన మంత్రి జగదీశ్‌రెడ్డిని చూసి ఉబికి వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ లక్ష్మమ్మ తన బాధలు వివరించింది. పక్ష వాతానికి గురైన భర్తకు సపర్యలు చేసేందుకు తన శక్తి సరిపోవడం లేదని, తనకూ ఆరోగ్యం బాగా లేదని, తమకు ఎవరూ లేరని.. ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలని మంత్రిని వేడుకున్నది. స్పందించిన మంత్రి మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. నేనే మీ ఇంటికి వస్తాను.. మీ ఇబ్బందులు తీరుస్తానని హామీ ఇచ్చారు.
లక్ష్మమ్మకు హామీ ఇచ్చినట్లుగానే గురువారం మంత్రి జగదీశ్‌రెడ్డి నేరుగా వృద్ధ దంపతుల నివాసానికి వెళ్లారు. గంటపాటు వారింట్లో ఉండి, వారికి జీవితంపై భరోసా కల్పించారు. వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. పక్షవాతానికి గురైన లక్ష్మమ్మ భర్తకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ వైద్యులతో మాట్లాడారు. వారిని హైదరాబాద్‌కు తీసుకు పోయే బాధ్యతను స్థానిక కౌన్సిలర్‌కు అప్పజెప్పారు. మొదట వైద్యం చేయించుకోవాలని సూచించిన మంత్రి మీ బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చారు.
అనాథాశ్రమాల్లో ఉంటూ 18 ఏండ్లు నిండిన వారు బయటకు వస్తారు.. వారిలో ఎవరినైనా దత్తత తీసుకోవాలని, వారికి తమ ఆస్తులు చెందేలా చేయడం ద్వారా వారు తమ బాగోగులు చేసేలా చేయవచ్చని మంత్రి వారికి సూచించారు. లేని పక్షంలో మంచి వృద్ధాశ్రమంలో ఉంచుతానని హామీ ఇచ్చారు. ఈ రెండింటిలో ఏది సరైందో నిర్ణయించుకోవాలని మంత్రి వారికి సూచించారు. రెండు రోజుల్లో వారికి నచ్చిన విధంగా చేయిస్తానని హామీ ఇచ్చిన మంత్రి వారికి కావాల్సిన మందులు, ఇతర వస్తువులను ఇప్పించారు.
మంత్రి తమ ఇంటికి వచ్చి భరోసా ఇవ్వడంపై వృద్ధ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. తమ మిగిలిన జీవితాన్ని మంత్రి చొరవతో సంతోషంగా గడుపుతామని పేర్కొన్నారు. కడుపున పుట్టిన పిల్లలు తమ తల్లిదండ్రులను సాక లేక బయటికి గెంటేస్తున్న రోజుల్లో వృద్ధ దంపతులకు పెద్ద కొడుకులా మంత్రి అండగా నిలువడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.