రామగిరి, జూన్ 16 : ఆది శంకరాచార్య శారద లక్ష్మీనరసింహ పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీస్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతీ స్వామి గురువారం నల్లగొండకు వచ్చారు. కర్ణాటకలోని చిక్‌మంగళూర్‌కు చెందిన స్వామిజీ దేశవ్యాప్తంగా పలు పీఠాలను స్థాపించారు.
శుక్రవారం నల్లగొండలోని పానగల్ సమీపంలో గల శంకరగోశాలలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రారంభోత్సవలో పాల్గొననున్నారు. ఆయన భక్తుడైన రుద్ర సేన ట్రస్టు గౌరవ బాధ్యులు కృష్ణమోహన్ ఆహ్వానంతో రాత్రి 8 గంటలకు నల్లగొండకు వచ్చిన ఆయనను ఘనంగా స్వాగతించారు. స్వామి వారిని ఛాయా సోమేశ్వరాలయ దేవస్థానం చైర్మన్, రుద్రసేన ట్రస్టు సభ్యులు గంట్ల అనంతరెడ్డి, పలువురు భక్తులు దర్శించుకున్నారు.
ఉదయం 9:30 గంటలకు పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఆశీర్వచనం అందిస్తారు. అక్కడి నుంచి శంకరగోశాలకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్ని మధ్యాహ్నం కృష్ణమోహన్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బసచేసి శనివారం మధ్యాహ్నం నల్లగొండ నుంచి బయల్దేరుతారని కృష్ణమోహన్ వెల్లడించారు.