సూర్యాపేట టౌన్, జూన్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం నేర్పించింది నిరంతర ప్రజా సేవేనని, అన్నివర్గాల ప్రజల అభివృద్ధితోపాటు పరిపాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రసాదించిన సూర్యాపేట జిల్లాను ఐక్యతతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో హిందూ వైకుంఠధామం పునర్నిర్మాణ పనులు, మినీ ట్యాంక్బండ్లతోపాటు పలు అభివృద్ధి పనులను అధికారులు, కాంట్రాక్టర్లతో సందర్శించి మాట్లాడారు. ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచని ఉమ్మడి నల్లగొండ జిల్లా కోట్లాది రూపాయలతో నేడు రూపురేఖలు మూరాయన్నారు.
ప్రజలందరికీ అవసరమైన అన్ని సేవలనూ అందుబాటులో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్రంలో సంచలనాత్మకంగా నూతన జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. ఎనిమిదేండ్లుగా నిరంతరం అభివృద్ధి పాలనతోపాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు విలువైన వైద్య విద్యను చేరువ చేసేందుకు పేటకు సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాలను ప్రసాదించారన్నారు.
మెడికల్ కళాశాలతోపాటు ప్రజలందరికీ అవసరమైన అన్ని శాఖలు ఒకేచోట అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయానికి పక్కా భవనాలు నిర్మించుకుంటున్నామన్నారు. ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కోడి సైదులుయాదవ్, తాహేర్‌పాషా, బాషా, పాండురంగ పాల్గొన్నారు.