న్యూఢిల్లీ: శుక్రవారం సాయంత్రం. రాజస్థాన్‌కు చెందిన నవ దంపతులు ఆశీష్, అంజు వాకింగ్ చేస్తుండగా వారిని ఓ వాహనం ఢీకొంది. ఆశీష్ అక్కడికక్కడే మరణించగా అంజు బంగారు ఆభరణాలు చోరీకి గురై రోడ్డుపక్కనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హిట్ అండ్ రన్ కేసుగా కనిపించిన ఈ ఘటన పోలీసుల దర్యాప్తులో180 డిగ్రీల మలుపు తిరిగింది. మేఘాలయాలో జరిగిన హనీమూన్ హత్యను గుర్తుచేసుకున్న పోలీసులు ఆ దిశలో దర్యాప్తు జరిపి మిస్టరీని ఛేదించారు. ఆశిష్‌ని అంజునే చంపించిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. తన బాయ్‌ఫ్రెండ్ సంజుతోపాటు మరో ఇద్దరు ఆశిష్‌ని హత్య చేసి దీన్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇప్పుడు ఈ కేసును రాజస్థాన్ హనీమూన్ హత్యగా పోలీసులు పిలుస్తున్నారు.
శ్రీ గంగానగర్ ఎస్పీ అమ్రితా దుహన్ కథనం ప్రకారం జనవరి 30న రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు రోడ్డుపైన ఓ జంట అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు జంటను కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)కి తరలించగా ఆశిష్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించినట్లు తమకు సమాచారం అందినట్లు ఆమె చెప్పారు. ఘటనా స్థలిని పరిశీలించిన తాము ఫోరెన్సిక్ నిపుణులను కూడా రప్పించినట్లు ఎస్పీ తెలిపారు. తాను, తన భర్త సాయంత్రం నడక కోసం బయటకు వచ్చామని, ఇంతలో గుర్తు తెలియని వాహనం తమను ఢీకొందని 23 ఏండ్ల అంజు పోలీసులకు తెలిపింది. తన ఒంటి మీద ఉన్న బంగారం కూడా చోరీ అయిందని ఆమె చెప్పింది.
అయితే వాస్తవ పరిస్థితికి, అంజు వాంగ్మూలానికి మధ్య పొంతన లేకపోవడాన్ని పోలీసులు తమ దర్యాప్తు సందర్భంగా గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో ఉన్న వివరాలను బట్టి ఆశిష్ శరీరంపైన ఉన్న గాయాలను బట్టి చూస్తే అతడిని కొట్టి చంపినట్లు అర్థమవుతున్నది. అంజు శరీరంపైన ఎక్కడా ఎటువంటి గాయాలు లేకపోవడం కూడా పోలీసుల్లో అనుమానాలు పుట్టించింది. అంజు ఫోన్ రికార్డులను పరిశీలించిన పోలీసులకు తన ఇంటి సమీపంలోనే నివసిస్తున్న సంజు అనే వ్యక్తితో ఆమె తరచు ఫోన్లో సంభాషించినట్లు వెల్లడైంది. మూడు నెలల క్రితమే ఆశిష్‌తో అంజుకు పెండ్లయ్యింది. అయితే ఈ పెండ్లి పట్ల అసంతృప్తిగా ఉన్న అంజు కొన్ని రోజులకే తన స్వస్థలానికి వెళ్లింది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ సంజును కలుసుకుని ఆశిష్‌ని అడ్డు తొలగించడానికి పథకం వేసింది.
జనవరి 30న సాయంత్రం తన భర్తతో కలసి వాకింగ్‌కి బయల్దేరిన అంజు ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ పొదల్లో దాక్కున్న సంజు, అతని సహచరులు రాకీ అలియాస్ రోహిత్, బాదల్ అలియాస్ సిద్ధార్థ్ కలసి ఆశిష్‌పై దాడి చేశారు. అతని గొంతుపిసికి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని ఎస్పీ తెలిపారు. దీన్ని చోరీ ఘటనగా కనిపించడానికి అంజు తన శరీరంపైన ఉన్న నగలను సంజుకు తానే తీసిచ్చింది. దాడి తర్వాత స్పృహ కోల్పోయినట్లు అంజు నటించింది. ఆశిష్ శరీరంపైన ఉన్న గాయాలే హత్య కుట్రను బయటపెట్టాయని ఎస్పీ చెప్పారు. అంజుతోపాటు సంజు, అతని సహచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.