నీలగిరి, జూన్ 16 : చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 40 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. గురువారం నల్లగొండలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన పల్లెపాక లెనిన్, గుడుగుంట్ల శోభన్‌బాబు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొంతకాలంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిపారు. బైక్‌పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి వారి వద్దకు వెళ్లి మంచినీళ్లు కావాలని అడగడం, తమ బర్రెలు తప్పి పోయాయి వెతుకుతున్నామంటూ గ్రామాల్లో తిరుగుతూ మహిళలను మాటల్లో పెట్టి వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కొని పారిపోయేవారు.
వీరు రెండు సంవత్సరాలుగా నల్లగొండలో 11, సూర్యాపేటలో 15, ఖమ్మం జిల్లాలో ఒక దొంగతనం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉండడంతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, పాత నేరస్తులపై నిఘా పెట్టడం వల్ల నేరాల సంఖ్యను అదుపు చేయగలిగినట్లు తెలిపారు.
బుధవారం ఉదయం మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఆలగడప టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా తాము చేసిన నేరాలను అంగీకరించారని పేర్కొన్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, రూ.77వేల నగదుతో పాటు రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండేండ్లుగా నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చైన్ స్నాచర్లను చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ డీఎస్పీ మొగిలయ్య, సీఐ వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ నర్సింహులు, సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.